
Social Service: కనీసం ఒక కప్పు టీ తాగాలంటేనే రూ.10 ఖర్చు చేయాల్సిన ఈ రోజుల్లో.. అదే ధరకు కడుపునిండా అల్పాహారం అందిస్తూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు గువాహటికి చెందిన ఓ మహిళ. లాభాలకంటే సేవే ముఖ్యమన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆమె.. రోజూ వందలాది మంది విద్యార్థులు, పేదలు, కూలీల ఆకలిని తీర్చుతూ అందరి మన్ననలు పొందుతున్నారు.
అస్సాం రాష్ట్ర రాజధాని గువాహటిలోని క్లబ్ ఫ్లైఓవర్ సమీపంలో తెలుగు కాలనీ వద్ద 47 ఏళ్ల సన్నో కౌర్ నిర్వహిస్తున్న చిన్న హోటల్ ఇప్పుడు నగరమంతా చర్చనీయాంశంగా మారింది. ఈ హోటల్‌లో ప్లెయిన్ దోశ, ఇడ్లీ కేవలం రూ.10కే లభిస్తాయి. అంతేకాదు, ఆ టిఫిన్లతో పాటు రుచికరమైన కొబ్బరి చట్నీ, సాంబార్ కూడా అందించడం విశేషం. పెరుగుతున్న ధరల కాలంలో ఇంత తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం దొరుకుతుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.
10 రూపాయల టిఫిన్లతో పాటు ఇతర వంటకాలను కూడా చాలా తక్కువ ధరలకే అందిస్తున్నారు. మసాలా దోశను రూ.20కు, ఎగ్ దోశను రూ.30కు, చీజ్ దోశను రూ.40కు, ఆలూ పరాఠాను రూ.25కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు వింటేనే ఆశ్చర్యం కలుగుతుండగా, తిని చూసినవారు మాత్రం రుచి, నాణ్యతపై మరింత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది ప్రారంభమైన ఈ హోటల్ వెనుక ఉన్న కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. సన్నో కౌర్‌కు మొదట వంటలు చేయడం కూడా రాదని ఆమె స్వయంగా చెబుతారు. కుటుంబ సభ్యుల కోసం యూట్యూబ్ వీడియోలు చూసి వంటలు నేర్చుకున్నారు. ఇంట్లో అందరికీ వండి పెట్టినప్పుడు వచ్చిన ప్రోత్సాహమే ఆమెను ఈ చిన్న హోటల్ ప్రారంభించేలా చేసింది. కుటుంబ సభ్యులంతా కలిసి ఆలోచించి ఇంటి ముందు చిన్న స్థాయిలో ఈ దుకాణాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం హోటల్ నిర్వహణలో ఆమె కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు సహాయపడుతున్నారు. కొందరు వంటల్లో, కొందరు సరఫరాలో, మరికొందరు శుభ్రత చూసుకుంటూ ఒక కుటుంబంగా కలిసి పని చేస్తున్నారు. దీంతో ఈ హోటల్ ఒక వ్యాపార స్థలంగా కాకుండా, సేవాభావంతో నడిచే కుటుంబ సంస్థగా మారింది.
గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, ఈ ధరలకు టిఫిన్లు అందించడం చాలా కష్టమేనని సన్నో కౌర్ చెబుతున్నారు. అయినా కూడా ప్రజల ఆకలి తీరాలన్న ఆలోచనతో లాభాలను పక్కనపెట్టి ముందుకు సాగుతున్నానని ఆమె అంటున్నారు. రోజుకు సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తుందని, అదే తనకు చాలనేది ఆమె అభిప్రాయం.
భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ధరలు పెంచాల్సి వచ్చినా, పేదలు, విద్యార్థులకు అందుబాటులోనే ఉండేలా చూస్తానని సన్నో కౌర్ స్పష్టం చేస్తున్నారు. ఈ హోటల్‌కు ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, కోచింగ్ సెంటర్లకు వెళ్లే యువత, కూలీలు వస్తుంటారు. 10 లేదా 20 రూపాయలతోనే కడుపు నిండుతుండటంతో తమకు ఎంతో ఉపశమనం కలుగుతోందని వారు చెబుతున్నారు. దీంతో మానవత్వం, సేవాభావం ఇంకా బతికే ఉందని సన్నో కౌర్ హోటల్ నిరూపిస్తోంది. లాభాల కోసం కాకుండా, ఆకలితో ఉన్నవారికి భోజనం అందించాలన్న ఆలోచనతో ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ఇప్పుడు చాలామందికి స్ఫూర్తిగా మారుతోంది.
ALSO READ: Village Politics: స్థానిక సమరంలో హస్తం హవా





