జాతీయం

Smartphone, TV Prices Hike: పెరగనున్న స్మార్ట్‌ ఫోన్లు, టీవీల ధరలు, కారణం ఏంటంటే?

దేశంలో స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల ధరలు పెరగనున్నాయి. 4 నుంచి 8 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశీయ మార్కెట్ లో స్మార్ట్‌ ఫోన్లు, టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు మరోసారి పెరగనున్నాయి. సుమారు 4 నుంచి 8 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో 21 శాతం పెరిగిన ధరలకు అదనంగా ఈ భారం పడనున్నది.  ఏఐ, హై ఫర్ఫార్మెన్స్ గల కంప్యూటింగ్‌ టెక్నాలజీలను వేగంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో మెమెరీ చిప్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఫలితంగా వీటి ధరలు పెరగనున్నాయి.

గత క్వార్టర్ లో 50 శాతం పెరిగిన చిప్ ధరలు

గత త్రైమాసికంలో 50 శాతం పెరిగిన మెమరీ చిప్‌ల ధరలు ఈ త్రైమాసికంలో మరో 40-50 శాతం పెరగవచ్చు. ఏప్రిల్‌-జూన్‌లో అదనంగా 20 శాతం పెరుగుతాయని అంచనా. ఈ పరిణామం ఇప్పటికే వివో, నథింగ్‌ వంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులపై ప్రభావం చూపుతున్నది. జనవరిలోనే ఈ కంపెనీలు తమ ఫోన్ల ధరలను రూ. 3,000-రూ. 5,000 వరకు పెంచాయి. కొన్ని కంపెనీల తయారీదారులు మెమరీ చిప్‌లను సంపాదించేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొడక్‌, థామ్సన్‌, బ్లావ్‌పంక్ట్‌ బ్రాండ్ల టీవీలను విక్రయించే సూపర్‌ ప్లాస్ట్రోనిక్స్‌ ఈ చిప్‌ కొరత కారణంగా తనకు వచ్చిన ఆర్డర్లలో కేవలం 10 శాతాన్ని మాత్రమే నెరవేర్చగలుగుతున్నది.

ధరల పెంపునకు ఆయా కంపెనీలు రెడీ

గత నవంబర్‌లో 7 శాతం ధరలు పెంచామని, ఈనెలలో మరో 10 శాతం ధరలు పెంచుతామని, ఫిబ్రవరిలో మరో 4 శాతం పెంపు ఉంటుందని కంపెనీ సీఈవో నవనీత్‌ సింగ్‌ మార్వా తెలిపారు. రిటైల్‌ చెయిన్లు ఇప్పటికే ల్యాప్‌టాప్‌ ధరలను 5-8 శాతం పెంచగా, ధరల పెంపుపై ప్రధాన టెలివిజన్‌ బ్రాండ్లు ఆలోచన సాగిస్తున్నాయి. ఈ పెరుగుదల తక్షణ డిమాండుపై ప్రభావం చూపగలదని గ్రేట్‌ ఈస్టర్న్‌ రిటైల్‌ డైరెక్టర్‌ పుల్కిత్‌ బెయిడ్‌ తెలిపారు. గత ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్ల ధరలు 3-21 శాతం పెరిగినట్లు ఆల్‌ ఇండియా మొబైల్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. రానున్న నెలల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు 30 శాతం పెరిగే అవకాశం ఉందని ఏఐఎంఆర్‌ఏ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button