క్రైమ్

నాంపల్లిలో అస్థిపంజరం కలకలం, పాత ఫోన్‌తో మిస్టరీ ఛేదన

  • యువకుడు చనిపోయి పదేళ్లకు పైమాటే

  • స్థానిక యువకుడి వీడియోతో వెలుగులోకి స్కెల్టన్‌

    క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున, నాంపల్లిలోని ఓ పాడుబడిన భవనంలో యువకుడి అస్థిపంజరం బయటపడటం స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఆ యువకుడు చనిపోయి పదేళ్లకు పైనే అయినట్టు తెలుస్తోంది. ఆ యువకుడికి సంబంధించిన బంధువులంతా విదేశాల్లో స్థిరపడటం, సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఎవరూ పట్టించుకేలేదని గుర్తించారు. ఒక బంధువు స్థానికంగానే ఉన్నా… ఆ యువకుడిని దగ్గరకు తీయలేదని చెబుతున్నారు.

    వివరాల్లోకి వెళ్తే… నాంపల్లిలోని ఓ గల్లీలో పాత పాడుబడిన భవనం ఉంది. ఆ ఇంటి యజమాని, పిల్లలు అందరూ విదేశాల్లో స్థిరపడటంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది. బంధువుల్లో ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండి జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఒకరికి మతిస్థిమితం సరిగాలేదు. అయితే మతిస్థిమితంలేని వ్యక్తిని అమిర్‌గా గుర్తించారు. బంధువులంతా విదేశాల్లో ఉండటం, ఇక్కడ ఉన్న ఒక్క వ్యక్తీ అమిర్‌ను పట్టించుకోకపోవడంతో కుంగుబాటుకు గురై చనిపోయినట్లు గుర్తించారు. అమిర్‌ 2015లో చనిపోయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు.

    కేసును ఛేదించిన పాత ఫోన్‌

    అమిర్‌ అస్థిపంజరం దగ్గర నోకియా సెల్‌ఫోన్‌, పాత కరెన్సీని గుర్తించారు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని బాగుచేయించి డేటాను వెలికితీశారు. సెల్‌కు 84 మిస్డ్‌ కాల్స్‌ వచ్చినట్లు తేల్చారు. ఈ మిస్డ్‌ కాల్స్‌ అన్నీ 2015లోనే ఉన్నట్లు తేల్చారు. సెల్‌ఫోన్‌ డేటాను విశదీకరించిన అనంతరం బయటపడ్డ అస్థిపంజరం స్థానిక యువకుడు అమిర్‌దిగా గుర్తించారు. అస్థిపంజరం చుట్టుపక్కల ఎలాంటి ఆధారాలు, పెనుగులాట, ఇతరత్రా ఏమీ దొరక్కపోవడంతో సహజమరణంగానే భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి, ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

    యువకుడి వీడియోతో వెలుగులోకి ఘటన

    స్థానికంగా ఉండే కొందరు యువకులు సదరు పాడిబడిన భవనంలోకి వెళ్లారు. భవనంలోకి దూరి అక్కడ ఏమేమి ఉన్నాయన్నది వీడియో తీశారు. కొంచెం లోపలికి వెళ్లి చూడగా అస్థిపంజరం కనపడింది. దీన్ని వీడియో తీసిన యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు… అమిర్‌ అస్థిపంజరంగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button