Supreme Court warns EC: ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలకు ముమ్మరంగా కొనసాగిస్తోంది. రీసెంట్ గా ఎన్నికలు జరిగిన బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పూర్తి కాగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2.0 కొనసాగుతోంది. పకడ్బందీగా ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకు ప్రయత్నిస్తున్నబూత్ స్థాయి, ఇతర అధికారులకు బెంగాల్ లో తీవ్రంగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి వాటిని తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల సంఘానికి సూచించింది. లేదంటే ఈ ధోరణి తీవ్ర గందరగోళానికి దారిస్తుందని హెచ్చరించింది.
‘సర్’కు ఎదురవుతున్న బెదిరింపులపై సుప్రీం విచారణ
‘సర్’ నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. జాబితా తయారీలో ఉన్న అధికారులకు ఆయా రాష్ట్రాలు సహకరించకపోతే తీవ్రంగా పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి సారథ్యంలోని ధర్మాసనం ఈసీకి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం, ప్రక్రియలో ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని.. అప్పుడు అధికారుల భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీచేస్తామని ఈసీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాకేశ్ ద్వివేదికి ధర్మాసనం సూచించింది.
పరిస్థితి దిగజారితే కఠిన చర్యలు
‘సర్’ రూపకల్పనలో ఇబ్బందులు ఇలాగే ఎదురయితే, పరిస్థితి మరింత దిగజారితే రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్న పోలీసులను డిప్యుటేషన్‌లో ఉంచడం మినహా మార్గం లేదని ఈ తరఫు న్యాయవాది ద్వివేది సుప్రీం కోర్టుకు సూచించారు. అయితే.. ఈ దిశగా… ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా మొదలయ్యేంత వరకు ఈసీ చర్యలు తీసుకోజాలదని ధర్మాసనం స్పష్టం చేసింది. బెంగాల్ అధికారులు కచ్చితంగా సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలని సూచించింది. లేకపోతే, కఠిన ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.





