జాతీయం

శుభాన్షుకు ఘన స్వాగతం, ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తొలిసారి ఇండియాకు వచ్చిన భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా ఘన స్వాగతం లభించింది. శుక్లాతోపాటు అమెరికాకు వెళ్లిన ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ కూడా భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ ఘన స్వాగతం పలికారు. యాక్సియం-4 మిషన్‌ కోసం శుక్లా గతేడాది అమెరికాకు వెళ్లారు. మిషన్ పూర్తయిన తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. శుక్లాకు స్వాగతం పలకడానికి ఆయన భార్య కామ్నా, కుమారుడు కియాష్‌ కూడా విమానాశ్రయానికి వచ్చారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు త్రివర్ణ పతాకాలు పట్టుకుని ఆయనకు స్వాగతం పలికారు.

ఇవాళ ప్రధాని మోడీని కలవనున్న శుక్లా

భారత్‌కు చేరుకున్న శుక్లా ఇవాళ ప్రధాని మోడీని కలవనున్నారు. అనంతరం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌ లోని లక్నోకు వెళ్తారు. ఈ నెల 22, 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ ఏడాది జూన్‌ 25న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన యాక్సియం-4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి  చేరిన ఈ నలుగురు వ్యోమగాములు అక్కడ పలు ప్రయోగాలు పూర్తిచేసుకుని ఈ ఏడాది జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. భారత్ నిర్వహించే ‘గగన్ యాన్’ మిషన్ కు శుక్లా నేతృత్వం వహించనున్నారు. శుభాంశు శుక్లా విజయానికి గుర్తుగా  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత మొదటి వ్యోమగామి-2047 నాటికి వికసిత్‌ భారత్‌ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌ సభలో ప్రత్యేక చర్చకు ప్రతిపాదించింది.

Back to top button