
భారత్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలన్న చర్చ రోజు రోజుకు బలపడుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో చిన్న వయసులోనే పిల్లలు సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వెలువడిన పలు అధ్యయనాలు ఈ ఆందోళనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
భారత్‌లో సుమారు 60 శాతం మంది పిల్లలు ప్రతిరోజూ సగటున 3 గంటల వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు వెల్లడైంది. చదువు, ఆటలు, కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని వదిలేసి స్క్రీన్‌లకే పరిమితమవడం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందట. ముఖ్యంగా సోషల్ మీడియా వ్యసనం పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను పెంచుతోంది.
సోషల్ మీడియా ద్వారా పిల్లలు సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ వేధింపులు, అనుచిత కంటెంట్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులోనే డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం, పోలికల భావన వంటి మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవే తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇప్పటికే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిషేధం అవసరమని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు అదే తరహా నిర్ణయం భారత్‌లోనూ తీసుకోవాలా అనే ప్రశ్న రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారత్ లాంటి యువత అధికంగా ఉన్న దేశంలో సోషల్ మీడియా పూర్తిగా నిషేధించడం సాధ్యమా? లేక కఠిన నియంత్రణలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలతోనే సమస్యను ఎదుర్కోవాలా? అన్న అంశాలపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు నిపుణులు నిషేధం కంటే నియంత్రణే సరైన మార్గమని అభిప్రాయపడుతుంటే, మరికొందరు చిన్న వయసులో సోషల్ మీడియా దూరం పెట్టడం పిల్లల భవిష్యత్తుకు మేలు చేస్తుందని అంటున్నారు.
సోషల్ మీడియా వల్ల సమాచారానికి చేరువ అవడం, టెక్నాలజీపై అవగాహన పెరగడం లాంటి లాభాలు ఉన్నప్పటికీ, నియంత్రణ లేకపోతే అవే ప్రమాదాలుగా మారుతున్నాయని నిపుణుల హెచ్చరిక. అందుకే పిల్లల వయసు, మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం స్పష్టమైన పాలసీ రూపొందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ఇక ఈ అంశంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం మొత్తంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా మాదిరిగా భారత్‌లోనూ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలా? లేక కఠిన నియమాలతో వినియోగాన్ని పరిమితం చేయాలా? అన్నదానిపై మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల ముందుంది.
ALSO READ: Lifestyle: మీరు చాలా బిజీ అని తెలుసు!.. కానీ సంతోషంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి





