Shocking video: పెంపుడు కుక్క దాడి చేయడంతో మహిళకు 50 కుట్లు

బెంగళూరులో మరోసారి పెంపుడు కుక్కల నిర్లక్ష్యం కలకలం రేపింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ మహిళపై పొరుగింటి పెంపుడు కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది.

బెంగళూరులో మరోసారి పెంపుడు కుక్కల నిర్లక్ష్యం కలకలం రేపింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ మహిళపై పొరుగింటి పెంపుడు కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది. తల నుంచి కాళ్ల వరకు కుక్క కరిచిన ఘటన నగర వాసుల్లో భయాందోళనలకు దారి తీసింది. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

జనవరి 26వ తేదీ ఉదయం సుమారు 6 గంటల 54 నిమిషాల సమయంలో టీచర్స్ కాలనీలో నివసిస్తున్న 31 ఏళ్ల మహిళ రోజూ చేసే విధంగానే మార్నింగ్ వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఎదురింటికి చెందిన పెంపుడు కుక్క ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగింది. ఏమి జరుగుతోందో అర్థం చేసుకునేలోపే ఆ కుక్క ఆమె తల, ముఖం, మెడ, చేతులు, కాళ్లపై వరుసగా కరిచింది. తీవ్ర భయంతో కేకలు వేసిన ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేసింది.

మహిళను కాపాడేందుకు ఒక వ్యక్తి ముందుకు రావడంతో అతడిపైనా ఆ కుక్క దాడి చేసింది. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో మహిళ తీవ్ర గాయాలతోనే పరుగెత్తుతూ ఇంట్లోకి వెళ్లి గేటు మూసుకుంది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే కుక్క మళ్లీ ఇంటి వైపు వెళ్లిపోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆ మహిళకు డాక్టర్లు తల, ముఖం, మెడ, చేతులు, కాళ్లపై మొత్తం 50 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. డాక్టర్లు ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, కానీ మానసికంగా తీవ్ర షాక్‌లో ఉన్నట్లు తెలిపారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లడమే తనకు ప్రాణాపాయంగా మారిందని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై మహిళ భర్త కుక్క యజమాని నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెంపుడు కుక్కను నియంత్రణలో ఉంచకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుక్క యజమానిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పెంపుడు కుక్కలను ఎలా పెంచాలి, ప్రజా భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: పేద విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం విద్యాలక్ష్మి పథకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button