
మనలో చాలా మంది వారానికి 3, 4 రోజులైనా నాన్ వెజ్ తినకుండా ఉండలేరు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలా ఇళ్లల్లో కూర ఎంపికే ఉండదు. కోడి కూర తప్పనిసరి అయిపోతుంది. మార్కెట్‌లో చికెన్ ధర అందుబాటులో ఉండటం, రుచిగా ఉండటం, త్వరగా వండుకోవచ్చు అన్న కారణాలతో చాలా మంది చికెన్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాదు ప్రోటీన్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి మంచిదని భావించి కూడా చాలామంది దీన్ని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు.
అయితే చికెన్ మొత్తం ఆరోగ్యకరమేనని అనుకోవడం తప్పేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోడిలోని కొన్ని భాగాలను తరచూ తినడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం కలగవచ్చని, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరి చికెన్‌లో ఏ భాగాలను అస్సలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామందికి కోడి మెడ భాగం అంటే చాలా ఇష్టం. ఇంట్లో కోడి కూర చేసినప్పుడు ప్రత్యేకంగా మెడ భాగాన్ని తీసుకుని తినేవారు కూడా ఉంటారు. కానీ ఈ భాగం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడి మెడ భాగంలో శోషరస వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా కోడి తన శరీరంలోని వ్యర్థాలు, మలినాలను బయటకు పంపుతుంది. ఈ భాగాన్ని తినడం వల్ల అందులో మిగిలిపోయిన హానికర బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు.
ఇక కోడి తోక భాగం కూడా చాలామంది ఇష్టంగా తింటారు. చిన్నగా ఉండే ఈ భాగం రుచిగా ఉంటుందనే భావనతో చాలామంది దీన్ని వదలరు. కానీ ఆరోగ్య పరంగా ఇది చాలా ప్రమాదకరమని నిపుణుల అభిప్రాయం. కోడి తోకలో హానికరమైన బ్యాక్టీరియా, విషపూరిత క్రీములు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి ఎంత బాగా ఉడికించినా పూర్తిగా నశించవట. ఈ పదార్థాలు శరీరంలోకి చేరితే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
మరొక ప్రమాదకర భాగం కోడి ఊపిరితిత్తులు. సాధారణంగా కోడి కోసినప్పుడు ఈ భాగాన్ని చాలామంది పడేస్తారు. కానీ కొందరు మాత్రం ప్రత్యేకంగా వండుకుని తింటారు. ఇదే అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోడి ఊపిరితిత్తుల్లో అత్యంత హానికరమైన సూక్ష్మజీవులు, క్రీములు ఉంటాయని, ఇవి మన శరీరంలోకి చేరితే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినా.. దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఏ భాగాలను తింటున్నాం అన్నది చాలా కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఇకపై చికెన్ తినేటప్పుడు ఈ ప్రమాదకర భాగాలను పూర్తిగా వదిలేసి, శుభ్రంగా వండిన మిగిలిన భాగాలనే తీసుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. చిన్న అలవాట్ల మార్పుతో పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
NOTE: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘క్రైమ్ మిర్రర్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
ALSO READ: కాస్ట్లీ బిచ్చగాడు.. భిక్షాటనతో ఎంత సంపాదించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు!





