
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ ప్యాకెట్ ఒక చిన్నారి జీవితంలో చీకట్లు నింపిన విషాదకర ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. సాధారణంగా రోజూ చూసే, పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థమే ఓ ఎనిమిదేళ్ల బాలుడికి శాశ్వత గాయంగా మారింది. చిప్స్ ప్యాకెట్ ఒక్కసారిగా పేలడంతో ఆ చిన్నారి ఒక కన్ను పూర్తిగా కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలోని బలాంగీర్ జిల్లా టిట్లాగఢ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ओडिशा के बलांगीर में चिप्स का पैकेट बना ‘बम’ — गैस चूल्हे के पास पहुंचते ही हुआ जोरदार धमाका, 8 साल के मासूम की एक आंख हमेशा के लिए खराब। पुलिस कर रही है प्रोडक्ट और ब्लास्ट की जांच।#Odisha #Balangir #BreakingNews #ChildInjured #ChipsPacketBlast pic.twitter.com/JIGuGhESEv
— Nandini Laxakar (@LaxakarNandini) January 13, 2026
టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ ఘాట్ గ్రామానికి చెందిన లబ్ హర్పాల్ కుమారుడు సోమవారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగొస్తూ దారిలోని ఓ షాపులో చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ ప్యాకెట్ తిందామని వంటగదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతని తల్లి భానుమతి హర్పాల్ గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తోంది.
వంట మధ్యలో నీళ్లు తీసుకురావడానికి తల్లి బయటకు వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఊహించని ప్రమాదం జరిగింది. బాలుడి చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ అనుకోకుండా జారి మండుతున్న గ్యాస్ స్టవ్‌పై పడింది. వేడి తగలగానే ఆ ప్యాకెట్ ఒక్కసారిగా బాంబులా భారీ శబ్దంతో పేలిపోయింది.
ఈ పేలుడు తీవ్రత నేరుగా బాలుడి ముఖంపై పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలో అతని కన్ను తీవ్రంగా దెబ్బతిని రక్తస్రావం మొదలైంది. బాలుడి అరుపులు విన్న తల్లి పరుగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చేసరికి, తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది.
కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు, కంటికి తగిలిన గాయం అత్యంత లోతుగా ఉందని తెలిపారు. ఆ కన్ను పూర్తిగా దెబ్బతిందని, ఇక చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మాటలు విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
“నేను బిస్కెట్లు తెచ్చుకోమని డబ్బులు ఇస్తే.. వాడు చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఇంత చిన్న వయసులో వాడి జీవితం ఇలా మారిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు” అంటూ బాలుడి తల్లి భానుమతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిన్నారి భవిష్యత్తు గురించి ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు తినే ఆహార పదార్థాల ప్యాకెట్లు ఇంత ప్రమాదకరంగా ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. చిప్స్ తయారు చేసిన కంపెనీపై టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్యాకెట్‌లో నింపిన గ్యాస్ నాణ్యత, పేలడానికి గల కారణాలను ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.





