
Sex Awareness: సెక్స్ విషయంలో ఇప్పటికీ చాలా మందిలో అనవసరమైన అపోహలు వస్తుంటాయి. దీనిని ఇలా చేయాలి, ఈ సమయానికే చేయాలి అనేట్లుగా పలు అభిప్రాయాలు ప్రజల్లో తిరుగుతుంటాయి. ముఖ్యంగా నెలసరి సమయంలో శృంగారం చేయొచ్చా లేదా అన్న విషయంపై చాలా మందికి స్పష్టమైన అవగాహన ఉండకపోవడం వల్ల సందేహాలు, భయాలు ఎక్కువవుతాయి. నిజానికి పీరియడ్స్ సమయంలో శృంగారం పూర్తిగా దంపతుల ఇష్టంపై ఆధారపడి ఉండే విషయం, దీనిపై ఎలాంటి ఖచ్చితమైన నిషేధం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వారు సూచిస్తున్నారు.
ఈ సమయంలో శృంగారంలో పాల్గొనాలా వద్దా అనేది ఇద్దరి భావోద్వేగాలు, శారీరక పరిస్థితులు, వ్యక్తిగత సౌలభ్యం ఆధారంగా నిర్ణయించాలి. ముఖ్యంగా శుభ్రత అత్యంత ముఖ్యం. పీరియడ్స్ సమయంలో శరీరం మరింత సున్నితంగా ఉంటుందనే కారణంగా వ్యక్తిగత పరిశుభ్రతను కచ్చితంగా పాటించడం ఇద్దరికీ అవసరం. శరీరం శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రతి క్రీడలో ఆనందం, సౌకర్యం లభిస్తుంది.
నెలసరి సమయంలో మహిళలు శారీరకంగా అలసట, నొప్పి, మనసులో ఆందోళన వంటి పరిస్థితులను అనుభవిస్తుంటారు. ఈ సమయంలో పురుషులు బలవంతం చేయకుండా, మహిళ మనసు, ఆమె భావోద్వేగాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఇష్టపూర్వకంగా ఇద్దరూ సమ్మతించినపుడే శృంగారం సరైన అనుభవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మహిళ ఏ సమయానికైతే సౌకర్యంగా ఫీల్ అవుతుందో, అదే సమయంలో ప్రేమక్రీడలో పాల్గొనమని నిపుణులు సూచిస్తున్నారు.
అప్పుడప్పుడూ ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలనే ఆలోచనను ఈ సమయంలో పూర్తిగా విరమించాలి. పీరియడ్స్ సమయంలో కొన్ని భంగిమలు అసౌకర్యంగా ఉండే అవకాశం ఉండటంతో సులభమైన, సౌకర్యవంతమైన భంగిమలను మాత్రమే ఎంచుకోవాలి. అలా చేయకపోతే రక్తస్రావం పెరగడం లేదా నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇలా నెలసరి సమయంలో శృంగారం చేయడంలో ప్రయోజనాలూ ఉన్నాయి. శృంగార సమయంలో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరంలో నొప్పులను తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు, క్రాంప్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. పరిశోధనల ప్రకారం.. మహిళల్లో సగానికి పైగా ఈ సమయంలో శృంగారం చేయడానికి ఇష్టపడతారని తేలింది. ఇది సహజంగానే హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే కోరిక.
అయితే ప్రతీ మహిళ ఒకే విధంగా స్పందించదు. కొందరు ఇష్టపడతారు, మరికొందరు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అందువల్ల దంపతులు పరస్పర భావాలను గౌరవించి నిర్ణయించాలి. ఏదైనా సమస్య, సందేహం, అసౌకర్యం ఉంటే దాన్ని దాచుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.





