Wednesday, March 25, 2026
HomeతెలంగాణJeevan Reddy: హస్తం వదిలి గులాబీ గూటికి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలం!

Jeevan Reddy: హస్తం వదిలి గులాబీ గూటికి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలం!

* జీవన్ రెడ్డి కోసం చివరి వరకు కాంగ్రెస్ ప్రయత్నాలు

* టీ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు విఫలం

* నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్న సీనియర్ నేత

* ఈరోజు అధికారికంగా ప్రకటన

* జగిత్యాల లో భారీ బహిరంగ సభ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దారులు మూసేశారా? తుది నిర్ణయానికి వచ్చేసారా? నేడు అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. బుధవారం జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5,000 మంది కార్యకర్తలతో ఈ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సభ వేదిక నుంచి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాలు అభిమానులతో పంచుకొని తన నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని తెంచుకొని గులాబీ పార్టీలో చేరే నిర్ణయం ప్రకటిస్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కొద్ది రోజుల కిందట రాజీనామా..

కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు జీవన్ రెడ్డి. గత కొంతకాలంగా జగిత్యాల నియోజకవర్గం విషయంలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అభ్యంతరాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అందుకే పార్టీని వీడడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డికి గులాబీ పార్టీతో పాటు బిజెపి నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే బిఆర్ఎస్ వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆయన కెసిఆర్ తో పాటు కేటీఆర్ తో భేటీ అయినట్లు కూడా ప్రచారం నడిచింది. గులాబీ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని వారు ఇచ్చిన హామీకి జీవన్ రెడ్డి సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.

చివరివరకు కాంగ్రెస్ ప్రయత్నం…

అయితే జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన సీనియారిటీని, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ హై కమాండ్ అంత సులువుగా వదులుకునేందుకు ఇష్టపడలేదు. అందుకే మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలను ఆయన వద్దకు పంపించింది. కానీ ఆయన మెత్తబడలేదు. అయితే తుదిగా తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన అవమానాలను గుర్తించుకొని జీవన్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పినట్లు సమాచారం. మొత్తానికి అయితే నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు జీవన్ రెడ్డి. ఈరోజు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా ప్రకటించనున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments