
Sensational Bill: అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో ఒక సంచలనాత్మక బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత కొంతకాలంగా వివాహ వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను, సమాజంలో ఏర్పడుతున్న అసమానతలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి ఇప్పటికే వివాహం జరిగిన విషయం తెలిసి కూడా మరో పెళ్లి చేసుకుంటే ఏడేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అంతేకాకుండా, మొదటి వివాహాన్ని దాచిపెట్టి ద్వితీయ వివాహం చేస్తే 10 ఏళ్ల వరకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు కుటుంబ వ్యవస్థను రక్షించడమే కాదు, మహిళల భద్రత, న్యాయం కోసం తీసుకున్న చర్యలేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
బిల్లును ఆమోదించిన అనంతరం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఇది ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకున్న చట్టం కాదని, ముఖ్యంగా ఇస్లాం ధర్మం మీద వ్యతిరేక భావనతో తీసుకొచ్చినది కాదని స్పష్టం చేశారు. ఇస్లాం నిజానికి బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదని, ఆ ధర్మం సంప్రదాయాలను నిజంగా అర్థం చేసుకునేవారు ఈ నిర్ణయానికి స్వాగతం పలుకుతారని ఆయన అన్నారు. ప్రపంచంలోని అనేక ఇస్లామిక్ దేశాలు ముఖ్యంగా టర్కీ వంటి దేశాలు ఇప్పటికే బహుభార్యత్వాన్ని నిషేధించాయని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్లో కూడా పలువురు భార్యలను తీసుకోవడంపై నియంత్రణ కల్పించేందుకు మధ్యవర్తిత్వ మండలి విధానాలు ఉన్నాయని ఉదాహరణగా చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా యూనిఫార్మ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్ష AIUDF పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ఈ చట్టం రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మతపరమైన హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఉందని వారు పేర్కొన్నారు.
ఈ బిల్లులో అత్యంత గమనించాల్సిన అంశం ఏమిటంటే.. కేవలం బహుభార్యత్వం చేసే వ్యక్తినే కాకుండా, అటువంటి వివాహాలను ప్రోత్సహించే వారిని కూడా చట్టం కింద శిక్షించనున్నారు. పెళ్లిని నిర్వహించే మతపెద్దలు, గ్రామ అధికారులు, తల్లిదండ్రులు, వివాహానికి హాజరయ్యే వ్యక్తులు ఎవరైనా ఈ చర్యలో భాగస్వాములు అయితే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అదనంగా, నేరస్థులుగా తేలిన వారికి ప్రభుత్వం అందించే నిధులు, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పధకాలు, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా రద్దు అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బహుభార్యత్వాన్ని ఏ రూపంలోనైనా ప్రోత్సహించేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని స్పష్టంగా కనిపిస్తోంది.
అదే సమయంలో, బాధిత మహిళలు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా వారికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనుంది. ఇది చట్టం వల్ల కలిగే సామాజిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న సానుకూల నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే ఈ చట్టం అస్సాంలోని షెడ్యూల్డ్ తెగలకు వర్తించదు. బోడోలాండ్ ప్రాదేశిక పరిధి, దిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్, పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ వంటి ప్రాంతాలు ఆరవ షెడ్యూల్ కిందకు వస్తాయి కనుక అక్కడి ప్రజలు ఈ బిల్లుకు లోబడరు.
ALSO READ: Gold and silver: బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈ విషయాలు తెలుసుకోండి..?





