
Senovax: వృద్ధాప్యం దగ్గరపడుతుందనే ఆలోచనతోనే చాలా మంది భయపడిపోతుంటారు. జీవిత ప్రయాణంలో శరీర శక్తి తగ్గిపోవడం, అందం క్రమంగా క్షీణించడం, ఆరోగ్య సమస్యలు వరుస వరుసగా దాడి చేయడం సహజమే అయినప్పటికీ, మనసులో మాత్రం ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని, కాలం ఎవరిపైనా ముద్ర వేయకుండానే జీవితం సాగాలని ప్రతి ఒక్కరికీ ఒక అంతర్మధనం ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దశాబ్దాలుగా మనుషుల్లో వృద్ధాప్యాన్ని తగ్గించే మార్గాల కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటివరకు పెద్దగా విజయాలు కనిపించకపోయినా, ఇటీవలి కాలంలో అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామి నగరంలో పనిచేస్తున్న ‘ఇమ్మోర్టా బయో’ అనే బయోటెక్ కంపెనీ ఆశ్చర్యకరమైన పురోగతిని సాధించింది.
ఈ కంపెనీకి చెందిన పరిశోధకులు వృద్ధాప్యాన్ని అడ్డుకునే ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. దీనికి ‘సెనోవాక్స్’ అని పేరు పెట్టారు. జంతువులపై చేసిన తొలిదశ ప్రయోగాలు పూర్తిగా విజయవంతం కావడంతో, ఈ వ్యాక్సిన్ మానవులపై కూడా పరీక్షించేందుకు సంస్థ అంతర్జాతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇమ్మోర్టా బయో శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ సెనోవాక్స్ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యానికి ప్రధాన కారణమైన ‘సెనెసెంట్ సెల్స్’ అనే కణాలను గుర్తించి పూర్తిగా నాశనం చేసేలా పనిచేస్తుంది. ఈ కణాలే శరీరంలో వృద్ధాప్య లక్షణాలను పెంచుతాయి కాబట్టి, ఇవి తొలగిపోయిన తర్వాత శరీరంలోని కణజీవనం పునరుద్ధరించబడుతుంది. దీని వల్ల మనుషుల్లో వృద్ధాప్యం నెమ్మదిస్తుందని మాత్రమే కాదు, భవిష్యత్తులో వృద్ధాప్యం పూర్తిగా అడ్డుకట్టకావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అదేవిధంగా, ఈ వ్యాక్సిన్ క్యాన్సర్‌తో పోరాటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రీక్లినికల్ పరీక్షల్లో సెనోవాక్స్ క్యాన్సర్ ట్యూమర్ల పెరుగుదలను తగ్గించడం మాత్రమే కాకుండా, వాటిని పెంచే రసాయన చర్యలను బలహీనపరిచింది. ఇది శాస్త్రవేత్తలకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. జంతువులపై చేసిన పరిశోధనల్లో జీవితకాలం దాదాపు 100 శాతం వరకు పెరిగినట్లు కనిపించడం సెనోవాక్స్‌పై విశ్వాసాన్ని మరింత పెంచింది.
ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ను స్టెమ్ సెల్ ఆధారిత పునరుజ్జీవన చికిత్స ‘స్టెమ్ సెల్ రివైవ్ థెరపీ’తో కలిపి ప్రయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శరీరంలోని పాత కణాల్లో ఏర్పడే గాయాలు, దెబ్బలు మానడం, కొత్త కణాల పుట్టుకకు సహాయపడడం వంటి అంశాల్లో ఈ థెరపీ ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తోంది. దీన్ని సెనోవాక్స్‌తో కలిపితే జీవన వ్యవస్థ మరింత బలపడుతుందని, వయసు పెరుగుతున్నప్పటికీ శరీరం యువకుడిలా పని చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి, వృద్ధాప్యాన్ని జయించగల ఒక సంచలనాత్మక చికిత్స ప్రపంచానికి చేరువలో ఉందని చెప్పొచ్చు. ఈ వ్యాక్సిన్ మానవులపై కూడా విజయవంతమైన ఫలితాలు ఇస్తే, ప్రపంచ వైద్య చరిత్రలో ఇది మరొక అద్భుత విప్లవంగా నిలవనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానవ జీవితకాలం పెరగడం, వృద్ధాప్య సమస్యలు తగ్గిపోవడం, రోగనిరోధక శక్తి మెరుగుపడడం వంటి అనేక వైద్య అద్భుత మార్పులు ప్రపంచానికి చేరువగా ఉన్నాయనే నమ్మకం వ్యక్తమవుతోంది.
ALSO READ: FLASH: యువతిపై ఎమ్మెల్యే రేప్, ఆపై..?





