ఇన్నాళ్లకు గులాబీ పార్టీకి చిక్కిన జీవన్ రెడ్డి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో వ్యూహాలే పని చేస్తాయి. కానీ అవి అన్నివేళలా కాదు. అయితే మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్ వ్యూహాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే ఓటమి ఎదురైందో అప్పటినుంచి ఆ వ్యూహాలు అంతు చిక్కడం లేదు. కానీ పుష్కర కాలం కిందట ఒక వ్యూహం వేశారు కేసీఆర్. కానీ నాడు చిక్కలేదు కానీ.. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఆయన వ్యూహం పనిచేసింది. దాని ఫలితమే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరడం.
అప్పట్లో కాంగ్రెస్ ను ఖాళీ చేయాలని..
తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలిగారు. తెలంగాణకు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసిఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని చూశారు. అలా జగిత్యాల టైగర్ గా పేరు పొందిన జీవన్ రెడ్డి కోసం గట్టి ప్రయత్నాలు చేశారట అప్పట్లో. కానీ చాలా రకాలుగా పాచికలు వేశారు. అందుకు జీవన్ రెడ్డి అప్పట్లో చిక్కలేదట. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. అదే జీవన్ రెడ్డి కెసిఆర్ బాట పట్టారు. 2014లో జీవన్ రెడ్డి కెసిఆర్ పార్టీలో చేరాల్సి ఉండేది. కానీ కాంగ్రెస్ భావజాలం పుణ్యమా అని జీవన్ రెడ్డి చేరలేదు. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన క్రమంలో జీవన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
అప్పట్లో టిడిపి పై ఆకర్ష్..
2014లో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ముందుగా తెలుగుదేశం పార్టీపై దృష్టి పెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపరిచారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా గులాబీ బాట పట్టారు. అప్పటివరకు ఉద్యమ తెలంగాణ అన్న కెసిఆర్.. బంగారు తెలంగాణ పేరు చెప్పి టిడిపి నేతలను పెద్ద ఎత్తున ఆకర్షించగలిగారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో టిడిపి లీడర్లు గులాబీ పార్టీలోకి వచ్చారు. అలా తన ప్రాబల్యాన్ని.. ప్రభావాన్ని పెంచుకుంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఫోకస్ పెట్టారు. కానీ అందుకు చిక్కలేదు కాంగ్రెస్ లీడర్లు. అందులో జీవన్ రెడ్డి కూడా ఒకరు. ఆయన కోసం అప్పట్లో చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో రకాల కేసులతో పాటు ప్రలోభాలు పెట్టారు. కానీ జీవన్ రెడ్డి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆత్మాభిమానానికి దెబ్బ తగిలింది అన్న కోణంలోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. గులాబీ పార్టీకి జై కొట్టారు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా.
