
Semicon India 2025: భారత్ సెమీ కండక్టర్ల రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారబోతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రస్తుతం దేశంలో రూ.1.57 లక్షల కోట్ల విలువ గల 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ మరో లెవల్ కు వెళ్లబోతుందన్నారు. త్వరలో రూ.87 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందనుకుంటున్న ప్రపంచ చిప్ మార్కెట్లో అవకాశాలను అందింపుచ్చుకునేందుకు వీలుగా డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మరింతగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సెమికాన్-2025 ప్రారంభ సమావేశంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. చమురు నల్ల బంగారం అయితే, చిప్ లు డిజిటల్ వజ్రాలు అన్నారు. 21వ శతాబ్ది శక్తి అంతా చిన్న చిప్ లో కేంద్రీకృతమైందన్నారు. భారత్ లో తయారైన చిన్న చిప్ ప్రపంచంలో పెద్ద మార్పు తెచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. భారత్ లో డిజైన్ అయి, భారత్ లో తయారై, ప్రపంచం విశ్వసించే చిప్ గా ఎదగబోతుందన్నారు.
సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు భారీ ప్రోత్సాహకాలు
దేశంలో అమల్లో ఉన్న కీలకమైన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు మొత్తం ఉత్పత్తి వ్యయంలో 70 శాతం ప్రోత్సాహకాలు యథావిధిగా అందుతాయని ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చెప్పారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులకు భారత్ అందిస్తున్న ప్రోత్సాహం కనివిని ఎరుగని విధంగా ఉందన్నారు. సుమారు రూ.2.61 లక్షల కోట్ల విలువ గల ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయన్నారు కృష్ణన్.