
Secundrabad Bonalu 2025: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదేనని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మహమ్మారితో పాటు అగ్నిప్రమాదాలు వెంటాడుతాయన్నారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు చక్కగా పండుతాయని చెప్పుకొచ్చారు.
వారిని రక్తం కక్కేలా చేస్తా!
ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నట్లు భవిష్యవాణి చెప్పారు స్వర్ణలత. కానీ, ప్రతి ఏటా ఏదో ఒక ఆటంకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పదే పదే హెచ్చరించినప్పటికీ, లెక్క చేయడం లేదన్నారు. పూజలన్నీ సక్రమంగా జరిపించాలన్నారు. లేదంటే, తన కోపానికి బలికాక తప్పదన్నారు. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుని చస్తారని హెచ్చరించారు. కాలం తీరిందంటే ఎవ్వరు ఏది అనుభవించాలో అది అనుభవించక తప్పదన్నారు. ఈ ఏడాది సరిగా పూజలు జరిపంచకుండా అడ్డుపడే వారిని రక్తం కక్కేలా చేస్తానన్నారు. ఆ తర్వాత తనను నిందించి ప్రయోజనం లేదన్నారు.
మహహమ్మారి వెంటాడుతోంది!
అటు రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే బాధ్యత తన మీద ఉందని భవిష్యవాణి చెప్పారు. మరికొద్ది రోజుల్లో మహమ్మారి వెంటాడే అవకాశం ఉందన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలకు కూడా ఇబ్బంది పెడతాయన్నారు. ఈ సంవత్సరం వర్షాలు చక్కగా కురుస్తాయన్నారు. పాడి పంటలను సమృద్ధిగా పండేలా చేసే బాధ్యత తనదేనన్నారు. భక్తులంతా పప్పు, ఫలహారాలతో పసుపు కుంకుమలతో తనను ఆనందపరిస్తే, కోరిందల్లా కొంగు బంగారం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర పాల్గొన్నారు. రంగం అనంతరం ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు జరుగనుంది.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరుసగా ఎన్ని రోజులంటే?