అంతర్జాతీయం

China GPS Tracker: చైనా జీపీఎస్ ట్రాకర్‌ తో పక్షి.. కర్ణాటక తీరంలో కలకలం!

చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న సముద్రపు పక్షి కర్ణాటక తీరంలో కనిపించింది. ఆ ట్రాకర్‌ లో చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈమెయిల్ ఐడీ ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Seagull China GPS Tracker: చైనా జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సీగల్ అనే సముద్రపు పక్షి కర్ణాటక తీరంలో కనిపించడం కలకలానికి దారి తీసింది. ఉత్తర కన్నడ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ వద్ద కోస్టల్ మెరీన్ పోలీస్ సెల్ బృందం ఈ పక్షిని గుర్తించింది. పక్షి గాయపడటంతో సిబ్బంది దాన్ని అటవీ శాఖకు అప్పగించారు. సీగల్ పక్షి ఒంటికి ఓ జీపీఎస్ ట్రాకర్ చుట్టి ఉందని అధికారులు తెలిపారు. ఈ జీపీఎస్‌లో ఒక ఎలక్ట్రానిక్ యూనిట్, సోలార్ ప్యానల్ ఉన్నట్టు చెప్పారు. ఈ పక్షిని చూసిన వారు ట్రాకర్‌ కున్న ఐడీ ద్వారా తమను సంప్రదించాలన్న సూచన కూడా ఉందని చెప్పారు. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించిన ఈమెయిల్ ఐడీ కనిపించిందని అధికారులు చెప్పారు.

జీపీఎస్ ట్రాకర్ పై అధికారుల దర్యాప్తు

ఈ పక్షి, దానికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ గురించి క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని ఉత్తర కన్నడ ఎస్పీ ఎమ్ఎన్ దీపన్ తెలిపారు. పక్షుల వలసలను అధ్యయనం చేసే ప్రాజెక్టులో ఈ పక్షి భాగమా? అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అనేక నావికా స్థావరాలకు కేంద్రమైన తీరంలో చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న పక్షి కనిపించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

సీగల్ పక్షి గురించి..

తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సీగల్ పక్షులు సంతానోత్పత్తి సమయంలో ఇతర ప్రాంతాలకు వలసపోతుంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవి ఉత్తారన ఉన్న చల్లని ప్రాంతాల నుంచి భూమధ్య రేఖకు సమీపంలో వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వలస వస్తుంటాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని అలవాటు పడిపోయే శక్తి వీటికుందని పరిశోధకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button