
PM Modi in SCO Summit: చైనాలోని తియాంజిన్ వేదికగా జరుగుతోన్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద సమస్యను లేవనెత్తారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా మారిందన్నారు. ఈ సమస్యతో భారత్ నాలుగు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోందన్నారు. అటు చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)పైనా ప్రశ్నలు లేవనెత్తారు.
BRIపై ప్రధాని కీలక ప్రశ్నలు
SCO సదస్సులో చైనా నిర్మిస్తున్న బీఆర్‌ఐ (Belt and Road Initiativ) ప్రాజెక్టు గురించి మోడీ ప్రస్తావించారు. ఈ తరహా ప్రాజెక్టులపై నమ్మకం, విశ్వాసం ఆధారంగా ముందుకువెళ్లాలని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని సూచించారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలల ప్రాజెక్ట్. 2013లో దీనిని ప్రారంభించారు. తొలుత దీన్ని చైనాలోని తీరప్రాంత పట్టణాలను కలుపుతూ నిర్మించాలని అనుకున్నారు. కానీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ప్రాజెక్టును చైనాను దాటి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాలకూ విస్తరింపజేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
పహల్గామ్ దాడిని ఖండించిన SCO
ఉగ్రవాదం, వేర్పాటువాదం శాంతికి సవాళ్లుగా మారాయని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇటీవల పహల్గామ్ దాడి ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందన్నారు. ఆ దాడి వేళ భారత్‌కు మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎదుటే పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టారు. అలాగే కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని విమర్శించారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిని SCO ఖండించింది. టెర్రరిజంపై ద్వంద్వవైఖరి సరికాదంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది.
అమెరికాకు చురకలు అంటించిన చైనా
అటు షాంఘై సహకార సదస్సు (SCO) లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా మధ్య, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు చెందిన పలువురు నేతలకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు జిన్ పింగ్ చురకలంటించారు. అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ప్రవర్తనను తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. నిష్పాక్షికత, న్యాయం, బహుళత్వానికి ప్రాధాన్యం ఉండాన్నారు. ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా, అల్లకల్లోలంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణిని ఏమాత్రం సహించకూడదన్నారు. బయటివారి జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు అన్ని దేశాల చట్టబద్ధమైన అభివృద్ధి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు ఎస్‌సీవోలోని సభ్యులంతా స్నేహితులు, భాగస్వాములుగా ముందుకుసాగాలన్నారు. షాంఘై సహకార సదస్సు సభ్యులకు 2 బిలియన్ యువాన్లు(281 మిలియన్ డాలర్లు) అందజేస్తానని ఈసందర్భంగా జిన్‌పింగ్ ప్రకటించారు.