
Saves Life: ‘దైవం మానుష రూపేణ’ అనే మాటలు కొన్నిసార్లు జీవితంలో నిజమై మన ముందే నిలబడినట్లు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనిషి రూపంలో దేవుడే వచ్చి కాపాడతాడని అనిపించే సంఘటనలు మన చుట్టూ జరుగుతుంటాయి. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులలో సరైన సమయంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు కోల్పోతుంటాయి. అయితే కొన్ని అరుదైన సంఘటనల్లో అతి కష్టసమయంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి, ప్రాణాపాయంలో ఉన్న వారిని స్వయంగా రక్షిస్తారు. అచ్చం అలాంటి హృదయాన్ని హత్తుకునే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా బండివాడే గ్రామంలో ఒక వివాహ వేడుక ఆనందోత్సవాల మధ్య కొనసాగుతుండగా అనూహ్యంగా జరిగిన ఓ ఘటన అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది. పెళ్లికి అతిథిగా వచ్చిన ఒక మహిళా అకస్మాత్తుగా తల తిరుగుతుందని చెబుతూ వేదికపైనే కుప్పకూలిపోయింది. వందలాది మంది మధ్యలో జరిగిన ఈ పరిస్థితిలో అతిథులు, బంధువులు ఏమి చేయాలో అర్థం కాక ఒక్క క్షణం నిలిచిపోయారు. అదే సమయంలో వరుడి పక్కన కూర్చున్న వధువు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే లేచింది. వైద్య వృత్తిలో ఉన్న వధువు, ఆ మహిళ ప్రాణాలు అతి ప్రమాదంలో ఉన్నాయని గ్రహించి, అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే ప్రథమ చికిత్స మొదలుపెట్టింది.
వేదికపై పండుగ వాతావరణం ఒక్కసారిగా ఆందోళనగా మారినా, వధువు మాత్రం పూర్తిగా శాంతంగా, వైద్యురాలిగా నేర్చుకున్న నైపుణ్యంతో ఆ మహిళకు శ్వాససంబంధ సహాయం అందించింది. పల్స్ పరీక్షించి, బీపీ అంచనా వేసి, ఆమెను నిదానంగా స్థిరపరిచే ప్రయత్నం చేసింది. పెళ్లి కూతురు ఇంత చాకచక్యంగా స్పందించడంతో, క్షణాల్లోనే ఆ మహిళ మళ్లీ చైతన్యం పొందింది. ‘వధువు రూపంలో దేవుడు వచ్చాడ’నే మాట అక్కడ ఉన్న అతిథులందరి నోటి మీద వినిపించింది.
తరువాత ఆమెను సమీప ఆస్పత్రికి తరలించగా, వధువు అందించిన తక్షణ చికిత్స వలన పెద్ద ప్రమాదం తప్పిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ హృదయానందకర ఘటన, ముఖ్యంగా వధువు చూపిన మానవత్వం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. వధువు సకాలంలో చూపిన ధైర్యసాహసాలు, వైద్య నైపుణ్యం నెటిజన్లు, స్థానికులు, బంధువులు అందరి ప్రశంసల వరదను కురిపించాయి. పెళ్లి కూతురిని చూసి ‘దైవం నిజంగా మనుష్య రూపంలోనే ఉంది’ అని అనిపించక మానదు.
ALSO READ: Alert: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు





