
Sanjana Galrani: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంజన గల్రానీ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజన, ఆ తర్వాత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో మీడియా దృష్టిని ఆకర్షించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన ఆట తీరుతో, ధైర్యమైన వ్యక్తిత్వంతో చివరి వరకూ నిలిచిన సంజన టాప్ 5 కంటెస్టెంట్‌లలో ఒకరిగా నిలవడం విశేషం.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని సంజన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగంగా వెల్లడించారు. ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ఆదరణ తనను ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు. హౌస్‌లోకి వెళ్లే ముందు ఉన్న సంజనకు, ఇప్పుడు బయటకు వచ్చిన సంజనకు చాలా తేడా ఉందని, ఈ షో తనను మానసికంగా మరింత బలంగా మార్చిందని తెలిపారు. సోషల్ మీడియాలో, బయట ప్రపంచంలో తనకు వస్తున్న స్పందన చూసి చాలా హ్యాపీగా ఉందన్నారు.
బిగ్ బాస్ ఇంట్లో మూడున్నర నెలల పాటు గడపడం తన జీవితంలో మరచిపోలేని అనుభవమని సంజన పేర్కొన్నారు. హోమ్ సిక్ కారణంగా తాను పూర్తిస్థాయిలో ఆట ఆడలేకపోయానని, కేవలం 10 నుంచి 20 శాతం శక్తినే వినియోగించినప్పటికీ హౌస్‌లో తన ఉనికిని చూపించగలిగానని చెప్పారు. ఎంత మంది తనపై విరుచుకుపడినా, ప్రశ్నలు వేసినా తాను కూల్‌గా, నవ్వుతూ సమాధానం చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుందని అభిప్రాయపడ్డారు. ఇదే తనకు బిగ్ బాస్‌లో పెద్ద ప్లస్ అయిందన్నారు.
ప్రస్తుతం బయట ప్రపంచానికి మళ్లీ అలవాటు పడే ప్రయత్నంలో ఉన్నానని సంజన చెప్పారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నానని, అయితే షో ముగిసిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు, మీటింగ్స్‌తో తన షెడ్యూల్ చాలా బిజీగా మారిందని తెలిపారు. అయినా ఈ బిజీ లైఫ్ తనకు ఆనందాన్నే ఇస్తోందన్నారు.
తాను పనిచేసిన హీరోలతో ఉన్న అనుబంధాలపై కూడా సంజన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. బుజ్జిగాడు సినిమాలో తాను ఆయనను బావగారు అని పిలిచే సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఎంతోమంది అమ్మాయిల హృదయాలు బ్రద్దలవుతాయని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రభాస్ చాలా ఇంట్రోవర్ట్ అని, ఎక్కువగా ఈవెంట్లకు రారని, తన షెల్‌లోనే ఉండడం ఆయనకు ఇష్టమని చెప్పారు.
విరాట్ కోహ్లీతో తన పేరు లింక్ అవడంపై కూడా సంజన స్పందించారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీతో తీసుకున్న పాత ఫోటో వైరల్ కావడం తనకు షాక్ ఇచ్చిందన్నారు. RCB కొత్తగా ఉన్న రోజుల్లో తాను బెంగళూరుకు చెందిన నటిగా అతిథిగా వెళ్లిన సమయంలో విరాట్‌తో పరిచయం ఏర్పడిందని, అది కేవలం స్నేహమేనని స్పష్టం చేశారు. మీడియా సృష్టించిన అనవసర వదంతులు ఆ స్నేహాన్ని దెబ్బతీశాయని, తనకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.
పవన్ కళ్యాణ్‌తో పనిచేసిన అనుభవాన్ని సంజన ఎంతో భావోద్వేగంగా వివరించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, స్త్రీల పట్ల ఆయన చూపే గౌరవం తనను బాగా ఆకట్టుకుందని అన్నారు. ఒక నటుడిగా మాత్రమే కాకుండా, సెమీ డైరెక్టర్‌లా సెట్‌లో ఆయన ఇచ్చే సూచనలు ఎంతో ఉపయోగపడేవని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖంలో ఉన్న ఛార్మ్, ఆయన ఆరా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, సెట్‌లో అందరి దృష్టి ఆయనపైనే ఉంటుందని వెల్లడించారు. తన నంబర్ వన్ మోస్ట్ ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
నాగార్జున విషయానికి వస్తే.. ఆయనను తన జీవితానికి మెంటార్‌లా, తండ్రిలా భావిస్తానని సంజన అన్నారు. అద్భుతమైన ఓర్పుతో, ఎవరినీ బాధపెట్టకుండా కరెక్షన్స్ చెప్పే ఆయన విధానం నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఒక జెంటిల్‌మెన్‌గా సమస్యలను పరిష్కరించే నాగార్జున స్టైల్ తనను బాగా ప్రభావితం చేసిందని తెలిపారు. ప్రతి వారం నాగార్జున సర్‌ని కలవాలనే ఆనందమే బిగ్ బాస్ హౌస్‌లో తన బాధలను మర్చిపోయేలా చేసిందన్నారు. ఆయన తిట్టినా అది ప్రేమతో కూడిన మందలింపులా అనిపించేదని సంజన పేర్కొన్నారు.
బిగ్ బాస్ షోతో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన సంజన గల్రానీ.. ఇకపై తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోందని ఆమె మాటల్లోనే స్పష్టమవుతోంది.
ALSO READ: ఈ 5 మంది పొరపాటున కూడా దానిమ్మ తినకూడదు, చాలా ప్రమాదకరం





