జాతీయం

సీఎం యోగిపై ప్రశంసలు, మహిళా ఎమ్మెల్యేపై ఎస్పీ సస్పెన్షన్!

MLA Pooja Pal Expel: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పై  సమాజ్ వాదీ పార్టీ మహిళా ఎమ్మెల్యే పూజాపాల్ ప్రశంసలు కురిపించింది. ఈ నేపథ్యంలో ఆమెపై సమాజ్‌వాదీ పార్టీ(SP) వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. తాజాగా యూపీ అసెంబ్లీలో విజన్‌ 2047పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పూజ.. ఎన్నో ఏళ్లుగా ఎవరూ గమనించని తన మౌన రోదనను సీఎం యోగి గుర్తించారన్నారు. తన దుఃఖం, బాధను గమనించి, న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన సమాజ్ వాదీ పార్టీ ఆమెపై చర్యలు తీసుకుంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

పూజాపాల్‌ కు 2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ తో వివాహం జరిగింది. పెళ్లైన న 10 రోజుల్లోనే రాజుపాల్‌ హత్యకు గురయ్యారు. ప్రయాగ్‌ రాజ్‌ లో మాఫియా డాన్, మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ అనుచరులు ఈ హత్యకు బాధ్యులుగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి న్యాయం కోసం పూజాపాల్‌ పోరాటం చేశారు. అయితే.. వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలిన అతిక్‌, అష్రఫ్ ను 2023 ఏప్రిల్‌ లో జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు. యోగి ద్వారా తనకు న్యాయం జరిగిందంటూ పూజ అసెంబ్లీలో చెప్పడం.. ఆదిత్యనాథ్‌ను పొగడ్తలతో ముంచెత్తడం సమాజ్‌ వాదీ పార్టీకి నచ్చలేదు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు వేశారు.

నిజం చెప్తే వేటు వేస్తారా?

ఎమ్మెల్యే పూజపై ఎస్పీ బహిష్కరణ వేటు వేయడం పట్ల అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. నిజం చెప్తే వేటు వేస్తారా? అని మండిపడింది. స్వాతంత్య్రదినోత్సవానికి ఒక్కరోజు ముందు.. అభివృద్ధి దృక్పథాన్ని అసెంబ్లీలో సమర్థించినందుకు పూజను బహిష్కరించడం సమాజ్‌వాదీ పేలవ మనస్తత్వానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్‌ విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీది మహిళా విరోధ విధానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: కాశ్మీర్ లో జల ప్రళయం, 60కి చేరిన మృతుల సంఖ్య!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button