జాతీయం

Sabarimala Chief Priest Arrested: బంగారం చోరీ కేసు.. శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్!

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును అరెస్టు చేసింది.

Sabarimala Temple Chief Priest Arrested: శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ఊహించని పరిణామం ఎదురయ్యింది. ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సిట్‌ అధికారులు ఆలయ ప్రధాన పూజారి(తంత్రి) కందరారు రాజీవరును  అరెస్టు చేసింది. తెల్లవారుజామున ఆయన్ను ప్రశ్నించిన సిట్‌ అధికారులు అనంతరం మధ్యాహ్నం తమ కార్యాలయానికి తరలించి అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ పొట్టి, ట్రావెంకూర్‌ దేవస్వం బోర్డ్‌ అధ్యక్షుడు పద్మకుమార్‌లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ప్రధాన పూజారిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాన నిందితుడితో సన్నిహిత సంబంధాలు

ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతడిని ఆలయానికి తీసుకువచ్చింది కూడా ఆయనేనని సిట్ అధికారుల విచారణలో తేలింది. శబరిమల ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తొడుగులకు, శ్రీకోవిల్‌ ద్వారం బంగారు తొడుగులకు మళ్లీ బంగారం తాపడం చేయాలని సలహా ఇచ్చింది కూడా ప్రధాన పూజారేనని సిట్‌ అధికారులు గుర్తించారు. ట్రావెంకూర్‌ దేవస్థానం బోర్డు ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు తాపడం చేయించేందుకు అనుమతి కోరగా.. ప్రధాన పూజారే మంజూరు చేసినట్లు సిట్‌ అధికారులు చెప్పారు. కాగా ఈ కేసులో సిట్‌ అరెస్టు చేసిన11వ వ్యక్తి రాజీవరు.

బంగారం చోరీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

మరోవైపు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ బంగారం చోరీపై శుక్రవారం పలు సెక్షన్ల కింద మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. సాక్ష్యాధారాలను సేకరించాక ఈ కేసులో అరెస్టయిన వారిని త్వరలో ఈడీ ప్రశ్నించనుంది. బంగారం తాపడం వ్యవహారానికి సంబంధించిన సంప్రదింపులు మొదలు విగ్రహాలను ఉన్నికృష్ణన్‌కు అప్పగించే వరకు తొలి నుంచి దేవస్థానం అధికారులు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, పర్యవేక్షణ వైఫల్యం కూడా ఉందని సిట్‌ కేరళ హైకోర్టుకు తెలియజేసింది. ఉన్నికృష్ణన్‌, ఈ కేసులోని ఇతర నిందితులు.. చెన్నైకి చెందిన గోవర్ధన్‌, స్మార్ట్‌ క్రియేషన్స్‌ సీఈవో పంకజ్‌ భండారీలతో కలిసి దేవస్థానంలో ఉన్న బంగారం పూత పూసిన అన్ని రాగి రేకుల నుంచి బంగారం కాజేసేందుకు నేరపూరిత కుట్ర పన్నినట్లు సిట్‌ తన స్టేట్‌మెంట్లో వెల్లడించింది. నిందితులందరూ కలిసే ఈ కుట్రకు పాల్పడినట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button