S Jaishankar On Pakistan: భారత్ ఎప్పుడూ పొరుగు దేశాలతో స్నేహం కోరుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. కానీ, కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని భారత్ మీదికి ఎగదోసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్‌ను నిరంతరం ఉగ్రవాదం ఎగదోస్తున్న చెడ్డ పొరుగుదేశంగా జైశంకర్ అభివర్ణించారు.
ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందన్నారు. ఐఐటీ మద్రాసులో తాజాగా ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు చేయాల్సినదంతా చేస్తామని, మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇతరులు నిర్ణయించలేరని అన్నారు. వ్యూహాత్మకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పొరుగు దేశాలతో సహకారానికి భారత్ సిద్ధం!
పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని చెప్పారు. పొరుగుదేశాలకు సాయం అవసరమైనప్పుడల్లా భారత్ ముందుంటుందని అన్నారు. మంచి పొరుగువారు ఉంటే ఇండియా పెట్టుబడులు పెట్టడం, సాయం అందించడం వంటివి చేస్తుందన్నారు. కోవిడ్ సమయంలో వాక్సిన్ ఇచ్చామని, ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో ఇంధనం, ఆహారం సరఫరా, ఆర్థిక సంక్షోభ సమయంలో శ్రీలంకకు 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేశామని జైశంకర్ చెప్పారు.





