అంతర్జాతీయంజాతీయం

Putin: అంతరాయం లేని ఆయిల్ సరఫరా చేస్తాం, భారత్ కు పుతిన్ హామీ!

భారత్‌కు అవసరమైన ఆయిల్ సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. గ్యాస్‌, బొగ్గు లాంటి అన్నిరకాల ఇంధనాలను అందిస్తామన్నారు.

భారత్ ఇంధన అవసరాలన్నీ తీర్చుతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హామీ ఇచ్చారు. భారత్‌కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్‌, బొగ్గు వంటి అవసరమైన అన్నిరకాల ఇంధనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీతో ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో చర్చలు జరిపారు. భారత్‌-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఇద్దరు నేతలు రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన సహకారంతోపాటు అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు.

భారత అణు విద్యుతకు సహకారం

భారత ఉత్పత్తులకు రష్యా మార్కెట్‌ను మరింతగా తెరుస్తామని ఈ సందర్భంగా పుతిన్‌ ప్రకటించారు. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్‌ ప్లాంటులో నిర్మాణంలో ఉన్న నాలుగు యూనిట్లను త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని పుతిన్‌ హామీ ఇచ్చారు. ఔషధ, వ్యవసాయం సహా ఇతర రంగాల్లో భారత్‌కు సహకారం అందిస్తామని పుతిన్‌ తెలిపారు. అటు భారత్‌- రష్యా మధ్య 80 ఏళ్ల స్నేహం కాలపరీక్షకు తట్టుకొని నిలిచిందని మోడీ అన్నారు. ఆర్థిక సహకారాన్ని మరోస్థాయికి తీసుకెళ్లటమే రెండుదేశాల ఉమ్మడి లక్ష్యమన్నారు. ఇందుకోసం 2030 వరకు కొనసాగే ఆర్థిక సహకార ప్రణాళికపై సంతకాలు చేశామన్నారు.

ఐదేళ్ల ఆర్థిక ప్రణాళిక

భారత్‌-రష్యా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 64 బిలియన్‌ డాలర్ల నుంచి 100 బిలియన్‌ డాలర్లకు పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్ల కాలానికి సంబంధించి ఆర్థిక సహకార ప్రణాళికపై సంతకాలు చేశారు. డాలర్‌కు బదులుగా సొంత కరెన్సీలోనే లావాదేవీలు నిర్వహించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. భారత్‌ త్వరలో రష్యా పౌరుల కోసం 30 రోజుల వ్యవధిగల ఉచిత ఈ- టూరిస్ట్‌ వీసాలను, 30 రోజుల గ్రూప్‌ టూరిస్ట్‌ వీసాలను జారీచేసేందుకు ఒప్పందం కుదిరిగింది.  రష్యాలో 1.2 బిలియన్‌ డాలర్లతో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్‌ యూరియా ప్లాంటు ఏర్పాటుచేసేందుకు భారత్‌కు చెందిన ఆర్‌సీఎఫ్‌, ఐపీఎల్‌, ఎన్‌ఎఫ్ఎల్‌ సంస్థలు రష్యా కంపెనీ ఉరాల్‌చెమ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రష్యాకు బయల్దేరిన పుతిన్

గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు మోడీ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకగా, శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ వద్ద భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా పుతిన్‌కు స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో విందులో పాల్గొన్న అనంతరం పుతిన్‌ స్వదేశానికి తిరిగి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button