Rural India Drives Internet Boom: దేశంలోని గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా 2025 నాటికి మొత్తం 95 కోట్ల మంది దాటి క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటే.. దానిలో 57 శాతం అంటే సుమారు 54.8 కోట్ల మంది గ్రామాల్లోనే ఉన్నట్లు తేలింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా తన నివేదికలో వెల్లడించింది.
ఏటా 8 శాతం చొప్పున పెరుగుదల
గ్రామాల్లో కనెక్టివిటీలో వృద్ధి, షార్ట్ వీడియోల వీక్షణం, కృత్రిమ మేధ ఆధారిత సేవలతో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. కాంటార్ తో కలసి ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్టు 2025 పేరుతో రూపొందించిన ఆ నివేదికను బెంగళూరులో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, 1,000 గ్రామాల్లో లక్ష మంది నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించారు. దేశంలోఇంటర్నెట్ వినియోగదారులు ఏటా 8 శాతం చొప్పున పెరుగుతున్నారు. యువతలో ఏఐ సేవల వినియోగం ఎక్కువగా ఉంది. 15-24 ఏళ్ల మధ్య వారిలో 57 శాతం మంది, 25-44 ఏళ్ల మధ్య వారిలో 52 శాతం మంది గతేడాది ఏఐని వినియోగించారు. ఇంటర్నెట్ వినియోగం పెరుగుదలలో షార్ట్ వీడియోల పాత్ర కీలకం.
గ్రామస్తులే ఎక్కువ!
2025లో 58.8 కోట్ల షార్ట్ వీడియోలను వీక్షించారు. వీటి వీక్షకుల్లో పట్టణ వాసుల కంటే గ్రామ వాసులే కాస్త ఎక్కువగా ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇంతలా పెరుగుతున్నా కూడా దేశ జనాభాలో 38 శాతం మంది ఇంకా నెట్‌కు దూరంగానే ఉన్నారు.





