జాతీయం

RRB: రైల్వేలో 22 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత ఉంటే చాలు!

RRB: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే శుభవార్తను భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

RRB: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే శుభవార్తను భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో దేశంలోని పలు రైల్వే రీజియన్లలో మొత్తం 22,000 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనతో లక్షలాది మంది ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి.

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజాగా తేదీ మార్పు చేశారు. తాజా నిర్ణయం మేరకు జనవరి 31, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజున ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పోస్టుల పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 2, 2026 వరకు అవకాశం కల్పించారు. రైల్వే శాఖ చేపడుతున్న ఈ భారీ నియామకాల్లో పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి.

గ్రూప్ డి పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి. విద్యార్హతలతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా నిర్దేశిత శారీరక ప్రమాణాలను కూడా అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది.

వయోపరిమితి విషయానికి వస్తే.. జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో తగిన సడలింపు వర్తిస్తుంది. ఈ అవకాశం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ రాత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 ప్రారంభ వేతనంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్‌లు కూడా అందించనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, సిలబస్, దరఖాస్తు ఫీజు వంటి పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ALSO READ: రిజిస్ట్రార్ ఆఫీసులో ఒక్కటైన I.P.S, ట్రైనీ I.A.S జంట (VIDEO)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button