* వైసీపీలో తగ్గిన ప్రాధాన్యం
* అందుకే పక్క రాష్ట్రం వైపు చూపు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? తమిళ రాజకీయాల్లోకి వెళ్తారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్ తగ్గించారు. పైగా రాజకీయాల్లోకి వచ్చాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఆమె తెలుగు పాలిటిక్స్ నుంచి.. తమిళ్ పాలిటిక్స్ లోకి వెళ్తారన్న ప్రచారం జోరందుకుంటుంది.
ఆది నుంచి సానుకూలత..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే తమిళనాడులో అధికార డిఎంకెకు మద్దతుగా రోజా ప్రచారం చేస్తున్నారు. ఆది నుంచి డీఎంకే విషయంలో రోజా సానుకూలంగా ఉన్నారు. అందుకే ఆమె ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. మరోసారి డీఎంకే అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రం తరఫున నామినేటెడ్ పదవి రోజా దక్కించుకుంటారన్న టాక్ నడుస్తోంది. ఆ ఒప్పందంతోనే ఆమె డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
తమిళ చిత్ర పరిశ్రమ వైపు..
రోజా భర్త సెల్వమణి తమిళనాడు చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. రోజా సైతం తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. చిత్తూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజా.. సెల్వమణిని వివాహం ఆడిన తర్వాత పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పని చేశారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నగిరి నుంచి గెలిచారు. 2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. అయితే మరోసారి నగిరి టిక్కెట్ ఆమెకు ఇచ్చే ఛాన్స్ లేదని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే క్రమేపి ఆమె తెలుగు రాజకీయాలకు గుడ్ బై చెప్పి తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
