జాతీయం

BMC Elections: ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు షిండే కార్పొరేటర్లు, మేయర్ పదవి కోసం పట్టు!

దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్‌ అయిన బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో రిసార్టు రాజకీయాలకు తెరలేచింది.

Resort Politics in Mumbai Again:  దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్‌ అయిన బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. తన మద్దతు లేకుండా పాలకమండలి కొలువుదీరే పరిస్థితి లేకపోవటంతో ఏక్‌నాథ్‌ షిండే బీజేపీతో బేరసారాలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫైవ్ స్టార్ హోటల్లో షిండే వర్గం కార్పొరేటర్లు

అటు షిండే తన కార్పొరేటర్లను ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు తరలించారు. ఏకంగా బీఎంసీ మేయర్‌ పదవి కోసమే బీజేపీ ముందు డిమాండ్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి దశాబ్దాలుగా శివసేన చేతిలోనే ఉందని షిండే పార్టీ కార్పొరేటర్లు తమ అధినేతకు గట్టిగా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ, అయినా..

శుక్రవారం వెళ్లడైన బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 89 సీట్లు గెలిచింది. దాని మిత్రపక్షాలైన శివసేన 29, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 3స్థానాల్లో గెలిచాయి. 227 వార్డులున్న బీఎంసీలో మేయర్‌ సీటు దక్కించుకోవాలంటే 114మంది మద్దతు అవసరం. బీజేపీ, శివసేన సభ్యులను కలిపితే 118 అవుతుంది. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కలిపితే మెజారిటీ మార్కుకు 8 సీట్లు మాత్రమే తగ్గుతున్నాయి.

మరోవైపు ముంబై మేయర్ పదవిని కచ్చితంగా బీజేపీ దక్కించుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. షిండే అటు ఇటు చేస్తే, అతడికే ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ముంబై మేయర్ సీటుపై కూర్చునేది ఎవరు అనేది తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button