జాతీయం

Terror Attack Threat: గణతంత్ర వేడుకలపై ఉగ్రవాదుల గురి, తెలంగాణలోనూ హై అలర్ట్!

గణతంత్ర వేడుకలే లక్ష్యం గా పాక్‌ ఉగ్రవాదులు దాడులకు కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్‌ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ భారత్‌లో ఉగ్రదాడులకు ప్రణాళిక వేసినట్లు వెల్లడించాయి.

High Alert Across India: గణతంత్ర వేడుకలు టార్గెట్ గా దాడులకు తెగబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్‌కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ భారత్‌లో ఉగ్రదాడులకు ప్రణాళిక వేసినట్లు గుర్తించాయి.  ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు హెచ్చరించాయి. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్ఐ జైషే ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26న పెద్దఎత్తున దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్‌ నేమ్‌ను పెట్టుకున్నట్లు తెలిపాయి. గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని తెలిపాయి.

అప్రమత్తం అయిన అధికారులు

నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూకశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు వాంటెడ్‌ నోటీసులు జారీ చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజల్ని కోరారు. సోషల్‌ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ.. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, హరియాణాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

తెలంగాణలోనూ హై అలర్ట్‌

దేశవ్యాప్తంగా ఈ నెల 26న పేలుళ్లతో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న సమాచారంతో కేంద్ర నిఘా బృందాలు ఇప్పటి కే రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు దేశవ్యాప్తంగా ఉన్న తమ స్లీపర్‌ సెల్స్‌ ను క్రియాశీలం చేస్తున్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల తాజా టార్గెట్‌ ఢిల్లీ మాత్రమే కాదని, అహ్మదాబాద్‌, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్‌, తిరుపతి, కొచ్చి, చెన్నై లాంటి నగరాలనూ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయి. స్లీపర్‌ సెల్స్‌ ఈ సారి భారీ స్థాయిలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటపడిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించారు. విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రజలు అత్యధికంగా సంచరించే మార్కెట్లు, మాల్స్‌ను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాద లింకులున్న అనుమానితులపై నిఘా పెట్టారు. తెలంగాణకు చెందిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు ఉగ్రవాద అనుమానితుల సమాచారాన్ని జిల్లా పోలీసులకు పంపించి అప్రమత్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button