
Rental Husband: ఉత్తర ఐరోపాలో బాల్టిక్ సముద్రతీరాన అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన లాత్వియా దేశంలో ఒక విచిత్రమైన సామాజిక ధోరణి వెలుగులోకి వస్తోంది. సంవత్సరాలుగా అక్కడ మహిళల జనాభా పురుషులతో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో కుటుంబ నిర్మాణాలు, దైనందిన జీవన శైలులు మారిపోయాయి. యూరోస్టాట్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. లాత్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5 శాతం ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది. ఈ అసమాన జనాభా నిష్పత్తి దేశంలో అనేక రంగాలలో ప్రభావం చూపిస్తోందని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పురుషుల కొరత కారణంగా, ముఖ్యంగా ఒంటరి మహిళలు లేదా వృద్ధ మహిళలు తమ ఇంటి పనులు, మరమ్మత్తులు, చిన్న చిన్న గృహ అవసరాల కోసం నమ్మదగిన సహాయం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సమాజంలో కొత్తగా ఒక సేవ ప్రాచుర్యం పొందుతోంది. దాన్ని స్థానికులు ‘అద్దె భర్త’ లేదా ‘రెంటల్ హస్బెండ్’ సేవ అని పిలుస్తున్నారు. ఈ సేవలో పనికివచ్చే నైపుణ్యాలు ఉన్న పురుషులను గంటల వారీగా లేదా రోజు వారీగా అద్దెకు తీసుకుని ఇంటి పనులు చేయించుకుంటున్నారు.
ఇంట్లో నీటి లీకేజీ, పలకలు పాడవడం, ఎలక్ట్రికల్ సర్వీస్, ఫర్నిచర్ మరమ్మత్తులు, చిన్నపాటి గృహ పనులు వంటి వాటికి సహాయం అందించే ఈ సేవలు మహిళలకు చాలా ఉపశమనం కలిగిస్తున్నాయి. పని ఒత్తిడితో ఉన్న ఉద్యోగినులైనా, ఒంటరిగా నివసించే వృద్ధ మహిళలనైనా, అక్రమంగా వదిలేసిన స్త్రీలకైనా ఈ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయని తెలియజేస్తున్నారు.
లాత్వియాలో నివసించే ఓ మహిళ మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల్లో పురుషులు తక్కువ అవ్వడం కారణంగా తమ స్నేహితురాళ్లు చాలామంది విదేశాలకు వెళ్లి అక్కడ భాగస్వాములను వెతికే పరిస్థితి వచ్చిందని, పురుషుల కొరత తమ సామాజిక జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతోందని పేర్కొంది. పక్క దేశాల నుంచి లేదా యూరప్‌లోని ఇతర ప్రాంతాల నుంచి పురుషులను జీవిత భాగస్వాములుగా పొందడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లాత్వియాలో పురుషుల విలువ పెరిగినట్టు అక్కడి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో మహిళలు తమ జీవితాల్లో అవసరమైన దినచర్య పనులను నిర్వహించుకునేందుకు ‘అద్దె భర్త’ సేవలు ఒక సామాజిక పరిష్కారంలా మారుతున్నాయి. పురుషుల కొరత వల్ల ఏర్పడిన ఈ ప్రత్యామ్నాయ సేవ అక్కడి సామాజిక నిర్మాణాల్లో ఒక కొత్త అధ్యాయం సృష్టించిందని చెప్పవచ్చు.
ALSO READ: Housing Scheme: సొంత ఇల్లు లేనివారికి గుడ్‌న్యూస్





