జాతీయం

Supreme Court: అక్రమంగా వచ్చిన వారికి హక్కులేంటి? సుప్రీం సీరియస్!

దేశ సరిహద్దులు దాటి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన రోహింగ్యాలు, ఇక్కడ చట్టాలను తమకు వర్తింపజేయాలని కోరడమేంటని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court On Rohingya: రోహింగ్యాల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశ సరిహద్దులు అక్రమంగా దాటి వచ్చిన వారు, ఈ దేశంలో చట్టాలన తమకు వర్తింపజేయాలని కోరడం ఏంటని సుప్రీంకోర్టు మండిపడింది. ఐదుగురు రోహింగ్యాలు కస్టడీ నుంచి అదృశ్యమయ్యారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

రోహింగ్యాలపై సుప్రీం సీరియస్ కామెంట్స్

అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరవాలని ఉద్దేశమా? అని పిటిషనర్‌ను సూటిగా ప్రశ్నించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. “మీరు సరిహద్దులను అక్రమంగా దాటారు. సొరంగం తవ్వో, కంచె దాటో దేశంలోకి అడుగుపెట్టారు. నేను ఇక్కడకు వచ్చినందున ఇక్కడి చట్టాలు అమలు చేయాలని అంటున్నారు. ఆహారం, ఆశ్రయం వంటివి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలకు చదువుకునే హక్కు ఉందంటున్నారు. ఇదెలా సాధ్యం?” అని పిటిషనర్‌ ను సీజేఐ నిలదీశారు.

చట్టబద్దత లేని శరణార్థికి హక్కులేంటి?

మన దేశంలో చాలా మంది పేదలు ఉన్నారని, వారు ఈ దేశ పౌరులని, వారికి నిర్దిష్ట ప్రయోజనాలు, సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. వాళ్లపై ఎందుకు దృష్టి సారించరు? అని క్వశ్చన్ చేశారు. శరణార్ధికి చట్టబద్ధతే లేనప్పుడు.. ఎవరైనా చొరబాటుదారులు అక్రమంగా దేశంలో చొరబడితే వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకుందా? అని వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు ఉందని, చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారిని రెడ్ కార్పెట్ స్వాగతం ఇస్తామా అని సీజేఐ వ్యాఖ్యానించారు. బాధిత పక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు మినహా పిటిషన్‌ను అనుమతించ రాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. పెండింగ్‌లో ఉన్న ఈ తరహా పిటిషన్లతో సహా తాజా పిటిషన్‌పై విచారణను కోర్టు డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button