
Delhi Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. ఆర్కే పురం, శాస్త్రి భవన్, మోతీ బాగ్, కిద్వాయి నగర్, భారత్ మండపం గేట్ నెం. 7, మథురా రోడ్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయం కాగా, తాజా వర్షాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని, కనిష్ఠం 25 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఢిల్లీలో గాలి నాణ్యత 116గా నమోదైంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఆగస్టు 14 వరకు ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
100కు పైగా విమానాలు ఆలస్యం
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా శనివారం 105 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉదయం 7:20 గంటలకు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ చూపించిన సమాచారం ప్రకారం, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే 13 విమానాలు, బయటి ప్రాంతాలకు వెళ్లే మరో 92 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు రెండో భాగంలో ఢిల్లీలో మళ్లీ వర్షాలు పడే అవకాశముంది.
Read Also: మూడు రోజులు భారీ వర్షాలు, మళ్లీ సాగర్ గేట్లు ఓపెన్!