
Rains In North India: రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హిమచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో వరద పోటెత్తుతోంది. మధ్య భారతంతో పాటు ఉత్తరాఖండ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, విదర్భ, గుజరాత్, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ఆరుగురు మృతి చెందారు.
హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం
అటు హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. మండి జిల్లాలోని బియాస్ నదికి వరద పోటెత్తింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గత 24 గంటల్లో భారీ వర్షాల ధాటికి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 20కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని 259 రోడ్లను మూసివేశారు. సోలన్ లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు. కల్కా-సిమ్లా రైల్వే లైన్ పై కొండ చరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు మహిళలు
అటు బీహార్ గయా జిల్లాల్లో ఆరుగురు మహిళలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జలపాతం చూసేందుకు వెళ్లిన ఆరుగురు మహిళలు నీటిలోకి దిగారు. ఆ తరువాత కొన్ని క్షణాలకే నీటి ఉధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన ఓ మహిళ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే మిగతా వారూ ఒడ్డుకు రావాలనుకున్నారు. ఇంతలో వరద ప్రవాహం పెరగడంతో ముగ్గురు మహిళలు దిగువకు కొట్టుకుపోయారు. స్థానికులు అప్రమత్తమై వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరుసగా ఎన్ని రోజులంటే?