Tamil Nadu Assembly Elections: వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ఆయా స్థానాల నుంచి బెర్తులు ఖరాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల తరఫున పోటీ చేయడానికి సినీ తారలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీల్లో పలువురు సినీ తారులు ఉండగా, కొత్తగా మరికొంత మంది యాడ్ కాబోతున్నారు.
ఆసక్తి ఉన్న సినీతారల వివరాలు సేకరణ
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్న సినీ నటులు అంతా.. తరచుగా ప్రచార పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపుతున్నారు. అదే సమయంలో వీరిలో ఒకరిద్దరు ఎన్నికల్లో పోటీకి దిగుతుంటారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తికనబరుస్తున్నవారికి దరఖాస్తుల పంపిణీ జరుగుతోంది.
అన్నాడీఎంకే తరపున అసెంబ్లీ బరిలోకి గౌతమి
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ తరపున ప్రముఖ నటి గౌతమితో పాటు మరో సినీనటి గాయిత్రి రఘురామ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేశారు. గౌతమి రాజపాళయంలోనూ, గాయత్రి రఘురామ్ మైలాపూరు, శ్రీరంగం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విధంగా ఆ పార్టీకి చెందిన మరికొందరు నటీనటులు కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న గౌతమి
చాలా కాలంగా గౌతమి పార్టీలో కొనసాగుతుంది. తరచుగా పార్టీ సమావేశాల్లోనూ పాల్గొంటుంది. గౌతమి గతంలో బీజేపీలో ఉండి, 2024లో అన్నాడీఎంకేలో చేరారు. పార్టీలో ప్రచార కార్యదర్శి డిప్యూటీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే గాయత్రి రఘురాం కూడా బీజేపీ విడి 2024లో అన్నాడీఎంకేలో చేరి, మహిళా విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో డీఎంకేను ఓడించి మళ్లీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సినీ ప్రముఖులను రంగంలోకి దింపడం ద్వారా పార్టీ బలోపేతం చేసుకుంటోంది. ఈ దరఖాస్తులతో తమిళనాడు రాజకీయాల్లో మరింత ఆసక్తికర పరిణామాలు ఆశిస్తున్నారు.





