Friday, March 13, 2026
Homeతెలంగాణరేషన్ బియ్యం కష్టాలు.. నిల్వ చేసే స్థలం లేక డీలర్ల సతమతం!

రేషన్ బియ్యం కష్టాలు.. నిల్వ చేసే స్థలం లేక డీలర్ల సతమతం!

•ముక్కి ముద్దవుతున్న దొడ్డు బియ్యం

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం, మర్రిగూడ మండలంలో అటకెక్కినట్లు కనిపిస్తోంది. రేషన్ షాపుల్లో పేరుకుపోయిన పాత దొడ్డు బియ్యం నిల్వలు, కొత్తగా వస్తున్న సన్నబియ్యానికి శాపంగా మారాయి. అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ బియ్యం నిల్వలు, ఇప్పుడు తీవ్రమైన సమస్యగా పరిణమించాయి.​ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించక మునుపు, గతంలో ఉన్న పాత దొడ్డు బియ్యం నిల్వలు, ఇంకా రేషన్ షాపుల్లోనే పడి ఉన్నాయి. నెలల తరబడి వీటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఆ బియ్యం ముక్కిపోయి, పురుగులు పట్టి, తుట్టెలు కట్టి పూర్తిగా పాడైపోతున్నాయి.
​ఈ దుస్థితి వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు, బూజు ఇప్పుడు కొత్తగా వస్తున్న సన్నబియ్యానికి కూడా సోకుతున్నాయి. ఫలితంగా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదనే చెప్పుకోవాలి. నిల్వ ఉన్న దొడ్డు బియ్యం కారణంగా, రేషన్ షాపుల్లో కొత్త స్టాక్ నిల్వ చేయడానికి చోటు లేకుండా పోతోందని, కొన్ని షాపుల్లో అయితే దొడ్డు బియ్యం ఉండటం వల్ల, కొత్తగా వచ్చే సన్నబియ్యం బస్తాలను ఎక్కడ వేయాలో, తెలియక డీలర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

ప్రభుత్వం నిర్ణయం.. డీలర్లకు తప్పని తిప్పలు

​ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం రాబోయే మూడు నెలల బియ్యాన్ని, ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే పాత బియ్యంతో షాపులు నిండిపోవడంతో, ఈ మూడు నెలల నిల్వను ఎలా సర్దుబాటు చేయాలో తెలియక డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బియ్యాన్ని అధికారులు వెంటనే తరలించకపోతే, కొత్తగా వచ్చే సన్నబియ్యం కూడా పాడైపోతుందని, ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిల్వ చేయడం, ఇప్పుడు అసాధ్యంగా మారిందని తెలుస్తుంది.

స్పందించని అధికారులు.. ఆందోళనలో ప్రజలు

​మండల వ్యాప్తంగా పలు రేషన్ షాపుల్లో ఇదే దుస్థితి నెలకొన్నా, అధికారుల స్పందన మాత్రం శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. పాత బియ్యాన్ని తిరిగి తరలించాలని, వేరే ప్రాంతాలకైనా మార్చాలని కూడా, అధికారులు ఆలోచన చెయ్యకపోవడంపై పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి, మగ్గిపోతున్న దొడ్డు బియ్యాన్ని తక్షణమే తొలగించాలని, తద్వారా సన్నబియ్యం పంపిణీని సజావుగా సాగాలని మండల ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రజలకు నాణ్యమైన బియ్యం అందడం కష్టమని, ప్రభుత్వ ఆశయం నెరవేరదని వారు ఆందోళన చెందుతున్నారు.. ఇక అధికారుల చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments