
Rare surgery: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు వైద్య చరిత్రలో నిలిచేంత క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. పుట్టినప్పటి నుంచే నడుము కింద భాగంలో తోకతో బాధపడుతున్న ఏడాదిన్నర చిన్నారి పరిస్థితి రోజురోజుకూ కష్టతరమవుతూ వచ్చింది. కదిలినా, పడుకున్నా, ఏదైనా తగిలినా తీవ్రమైన నొప్పితో పాపను ఇబ్బంది పెట్టేది. చిన్నారి తల్లిదండ్రులు అనేక ఆసుపత్రులను తిరిగినా ఎక్కడా శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు ముందుకు రాకపోవడంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో పడింది.
చివరికి బలరాంపూర్ జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించిన కుటుంబానికి అక్కడి సీనియర్ సర్జన్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ ఆశాకిరణంగా మారారు. చిన్నారిని పూర్తిగా పరీక్షించిన ఆయన ముందుగా ఎంఆర్ఐ, ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, రక్తపరీక్షలు నిర్వహించి పరిస్థితిని సమగ్రంగా అర్థం చేసుకున్నారు. ఫలితాలు సాధారణంగా రావడంతో నవంబర్ 14న శస్త్రచికిత్స చేపట్టాలని నిర్ణయించారు. అయితే శస్త్రచికిత్స సమయంలో ఆ తోక వెన్నెముక ఎముకలను కప్పి రక్షించే స్పైనల్ కార్డ్ మెంబ్రేన్‌కు బలంగా అతుక్కుపోయినట్లు గుర్తించారు. ఇది శస్త్రచికిత్సను మరింత ప్రమాదతరం చేసే అంశం. వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా, ప్రతీ అడుగూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఆ తోకను విజయవంతంగా తొలగించారు.
ఆపరేషన్ అనంతరం చిన్నారి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అతని రెండు కాళ్లు సహజరీతిలో పనిచేస్తున్నాయని, మూత్ర- విసర్జన నియంత్రణ వ్యవస్థ సవ్యంగా కొనసాగుతున్నదని చెప్పారు. చిన్నారి ప్రస్తుతం పాలు, మృదువైన ఆహారం సాధారణంగా తీసుకుంటూ పూర్తిస్థాయి కోలుకుంటున్నాడని వివరించారు. ఈ శస్త్రచికిత్స బలరాంపూర్ వైద్యుల నైపుణ్యాన్ని మరోసారి రుజువు చేసింది.
ALSO READ: VIRAL: రాజమౌళి తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్





