
Ranya Rao Gold Smuggling Case: కన్నడ సినీ రంగంలో కలకలం రేపిన బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావు పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తాజాగా ఆమెపై భారీ జరిమానా విధించింది. రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు కావడంతో ఆమెకు ఏకంగా రూ.102 కోట్ల జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. రన్యాతో పాటు ఈ అక్రమ వ్యాపారంలో పాలుపంచుకున్న ఇతరులు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. బెంగళూరుకు చెందిన హోటల్ యజమాని తరుణ్ కొండరాజుకు రూ.63 కోట్లు, ఆభరణాల వ్యాపారులు సాహిల్ సకారియా జైన్, భరత్ కుమార్ జైన్లకు తలో రూ.56 కోట్లు చొప్పున జరిమానా విధించారు. మొత్తంగా ఈ కేసులో వందల కోట్ల రూపాయల జరిమానా విధించడమే కాకుండా, నిందితులపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
రన్యాకు నోటీలు అందజేత
ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న రన్యారావు, మరో ముగ్గురికి డీఆర్‌ఐ అధికారులు 2,500 పేజీల జరిమానా నోటీసులు అందజేశారు. కాగా, రన్యారావు ఈ ఏడాది మార్చి 3న 14.8 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు దొరికింది. ఆమె కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావుకు కుమార్తె కావడం విశేషం.