
Rajinikanth 76: భారతీయ సినీ పరిశ్రమలో స్టైల్ అన్న పదం వినిపించినప్పుడల్లా మన ముందుకు గుర్తుకు వచ్చే తొలి పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. నటుడు అంటే పొడవైన శరీరం, అపారమైన అందం, కండలు తిరిగిన లుక్స్ ఉండాలనే భావనను పూర్తిగా తలకిందులు చేస్తూ, కేవలం తన స్టైల్, తెగువ, అటిట్యూడ్, అపూర్వమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను గెలుచుకున్న అరుదైన మహానటుడు ఆయన. రజినీకాంత్ సినిమాల్లో నడుస్తూ వచ్చేటప్పుడే థియేటర్లలో చప్పట్లు మార్మోగిపోతాయి. ఆయన డైలాగ్ చెప్పే మోడ్యులేషన్ గానీ, సిగరెట్ తిప్పే స్టైల్ గానీ, ఫైట్స్‌లో చూపించే వేగం గానీ ఇవన్నీ అభిమానులను సరికొత్త ఉత్సాహానికి గురిచేస్తాయి. అందుకే రజినీ సాధారణ హీరో కాకుండా, ఒక సంస్కృతి, ఒక ఫెనామినన్, ఒక తలైవా అని అభిమానులు భావిస్తారు.
దక్షిణాది నుండి ఉత్తరాది వరకు, భారతదేశం నుండి జపాన్ వరకు రజనీ అడుగుపెట్టిన ఎక్కడైనా ఆయనను చూసేందుకు ప్రజలు పోటెత్తుతారు. ఈరోజు డిసెంబర్ 12తో రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకుని, 76వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జీవితం, సినీ ప్రయాణం, ప్రపంచాన్ని అలరించిన స్టైల్ గురించి ప్రత్యేక కథనం.
1950 డిసెంబర్ 12న కర్ణాటకలోని మధ్యతరగతి మారాఠీ కుటుంబంలో శివాజీ రావు గైక్వాడ్‌గా జన్మించిన రజినీకాంత్ చిన్ననాటి నుంచే సాధారణ జీవనమే అనుసరించారు. ఆర్థిక పరిస్థితులు పరిమితంగా ఉండటం వల్ల చిన్నతనం నుండే కష్టాలు అనుభవించారు. కానీ ఆయనలో ఉన్న నటనా మెరుపు మాత్రం స్కూల్ స్టేజ్ షోలు, నాటకాలలో పాల్గొన్నప్పుడల్లా వెలుగులు విరజిమ్మేది. చదువు పూర్తయిన తర్వాత కుటుంబ భారాన్ని తగ్గించేందుకు బెంగళూరులో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేశారు. కాని అక్కడ కూడా ఆయన స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించేది. టికెట్లు ఇవ్వడం, ప్రయాణికులతో మాట్లాడే తీరు ఆయనలో దాగి ఉన్న హీరోకు నిదర్శనం.
నటన పట్ల ఉన్న అపారమైన ఆసక్తితో రజనీ చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడ ఆయనలో దాగి ఉన్న ప్రతిభను చూసిన దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్, ఈ బాలుడు ఒకరోజు స్టార్ అవుతాడని ముందుగానే ప్రకటించారు. 1975లో అపూర్వ రాగంగల్ చిత్రంతో రజినీ సినీ ప్రయాణం ప్రారంభమైంది. చిన్న పాత్రలోనే ఆయన చూపించిన ఎనర్జీ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వరుస అవకాశాలు వచ్చి పడటానికి ఆలస్యం కాలేదు.
ప్రారంభ దశలో రజనీ ఎక్కువగా నెగెటివ్ రోల్స్ చేస్తూ నటనా నైపుణ్యాన్ని పెంచుకున్నారు. 1978లో ఒకే ఏడాది 20కి పైగా సినిమాలు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇదే ఏడాది బైరవి చిత్రంతో తొలిసారిగా హీరోగా నిలిచి ప్రేక్షకుల మనసుల్లో సూపర్ స్టార్ బిరుదును దక్కించుకున్నారు.
రజనీకాంత్ స్టైల్ గురించి మాట్లాడితే అది ఒక పుస్తకం రాసినా సరిపోదు. ఆయన చేతులు తిప్పిన తీరు, స్టెప్పులు, చిరునవ్వు, డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఆయననే ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్టైల్‌ని చాలా మంది హీరోలు కూడా అనుకరించారు. కానీ తలైవా మేనరిజం మాత్రం ఎప్పటికీ ఒక్కరికి మాత్రమే చెందినది.
‘బాషా’ చిత్రం రజనీ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రజినీ పేరును దక్షిణాదిలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అన్నట్లు ముద్ర వేసింది. ముత్తు, నరసింహ, రోబో వంటి చిత్రాలతో ఆయనను అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తించారు. ముఖ్యంగా ముత్తు చిత్రం జపాన్‌లో రికార్డులు సృష్టించి, రజనీకి జపనీస్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫాన్‌బేస్ ఏర్పడేలా చేసింది. ఒక భారతీయ నటుడికి ఆ దేశంలో ఇంతటి అభిమాన గణం ఉండటం అరుదైన విషయం.
70 ఏళ్లు దాటిన వయసులో కూడా రజినీ నటనలో చూపించిన శక్తి ‘జైలర్’ చిత్రంలో స్పష్టంగా కనిపించింది. నల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రజనీ మ్యాజిక్ ఎప్పటికీ తగ్గదనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఈ ఏడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయన ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, రజనీకాంత్ క్రేజ్ కారణంగా చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అవార్డుల విషయానికి వస్తే రజినీకాంత్ అందుకోని పురస్కారం అంటూ లేదు. అందులో ముఖ్యంగా 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్‌తో పాటు అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఆయన నటించిన పడయప్ప చిత్రం నేటి పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ కావడం ఆయన అభిమానులకు పండగ చేస్తున్నట్టే.
హ్యాపీ బర్త్‌డే తలైవా.. యూ ఆర్ వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్..
ALSO READ: Donald Trump: మూడో వరల్డ్ వార్ రావొచ్చు





