
Putin Dials PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపే విషయానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పుతిన్ అలస్కాలో సమావేశమైన అనంతరం మోడీకి తాజాగా ఫోన్ చేశారు. మోడీకి పుతిన్ ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారని, శాంతియుత తీర్మానం చేసుకోవాలని సూచించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. దీనికి సంబంధించి తాము కూడా అన్నివిధాలుగా మద్దతిస్తామని ప్రధాని చెప్పారని వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రధాని మోడీ, పుతిన్ మాట్లాడారని, ఎప్పటికప్పుడు ఒకరితో మరొకరు సంప్రదింపులు సాగించాలని కూడా అనుకున్నారని పీఎంఓ తెలిపింది.
సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ప్రధాని మోడీ
అటు మంత్రి నరేంద్ర మోడీ సైతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. “మిత్రుడు పుతిన్ ఫోన్ చేసి అలస్కాలో ట్రంప్ తో జరిగిన సమావేశం వివరాలను పంచుకున్నందుకు థాంక్స్. ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం చేసుకోవాలని ఇండియా ఎప్పటికప్పుడు చెబుతోంది. ఇందుకు అన్నివిధాలా మా సహకారం ఉంటుంది” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. త్వరలో పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ కాల్ కు ప్రధాన్యత ఏర్పడింది.