బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం…
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః: ఎక్కువ కాలం ప్రధానిగా, సీఎంగా చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన భారత ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణకు ఏప్రిల్ మొదటి వారంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. కాగా కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్‌కు రానున్నారు.
ఈ పర్యటనలో భాగంగా నగరంలో నిర్వహించే ఒక భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుడతారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో, ఈ పర్యటనపై రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది.
ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీబీనగర్ ఎయిమ్స్ లో కొత్తగా నిర్మించిన పలు బ్లాకులు, అలాగే పూర్తయిన జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటితో పాటు, హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ రెండో దశ రైల్వే ప్రాజెక్టుకు, ప్రాంతీయ వలయ రహదారి ఉత్తర భాగానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని భావిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై పార్టీ పరంగా సమాచారం రావడంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్లో శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఈ విషయంపై ప్రాథమికంగా చర్చించారు. ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, కార్యక్రమాల టైమింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానుండటంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
