
హైదరాబాద్, (క్రైమ్ మిర్రర్):– నగరంలోని విద్యుత్ స్తంభాలకు అడ్డదిడ్డంగా వేలాడుతున్న కేబుల్లపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో (TSSPDCL) ప్రత్యేక దృష్టిసారించింది. పౌరుల భద్రత దృష్ట్యా, విద్యుత్ స్తంభాలకు పదిహేను అడుగుల కన్నా తక్కువ ఎత్తులో వేలాడుతున్న కేబుల్లను తక్షణమే తొలగించాలంటూ కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఈ సమస్యపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన అధికారులు, కొంతమంది ఆపరేటర్లు స్పందించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొన్ని ప్రాంతాల్లో అనవసర కేబుల్లను తొలగించారని తెలిపారు. అయితే, మరికొంతమంది ఆపరేటర్లు మాత్రం అప్రస్తుతం వ్యవహరిస్తున్నారని, చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అధికారుల ప్రకారం, నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ కేబుల్లు పాదచారులు, వాహనదారులు, విద్యుత్ స్తంభాలపై పని చేసే సిబ్బందికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, వెంటనే స్తంభాలకు వేలాడుతున్న తీగలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇకపై కేబుల్ల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించిన సంస్థలపై జరిమానాలు, అనుమతుల రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు వెల్లడించారు.