
Polished Rice: పాలిష్ చేసిన బియ్యం మన రోజువారీ ఆహారంలో విస్తృతంగా ఉపయోగపడుతున్నా, దీన్ని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బియ్యంలో సహజంగా ఉండే విటమిన్ బి1 తీసివేయబడటం వల్ల శరీరానికి థయామిన్ సరిపడా అందదు. ఈ లోపం కొనసాగితే బెరిబెరి అనే ప్రమాదకర వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీసి, హృదయ స్పందన మందగించడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
పాలిష్ చేసిన బియ్యంలో కార్బోహైడ్రేట్స్ శాతం చాలా అధికంగా ఉండడం మరో ముఖ్యమైన సమస్య. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీన్ని ఎక్కువగా తీసుకునే వారికి టైప్- 2 మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇటువంటి బియ్యంలో ఫైబర్ చాలా తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా సరిగా జరగదు. దీర్ఘకాలంగా ఈ బియ్యం తీసుకుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి.
ఫైబర్ లోపం కారణంగా పాలిష్ చేసిన బియ్యం తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయడం సాధారణం. ఎంత తిన్నా కడుపు నిండిన భావన రాకపోవడం వల్ల అదనంగా జంక్ ఫుడ్ తినే అలవాటు పెరిగి, బరువు అనవసరంగా పెరుగుతుంది. అంతేకాక, ఈ బియ్యంలో పోషకాలు చాలా తక్కువగా ఉండడం వల్ల కీళ్లకు కావాల్సిన శక్తి అందదు. దీని కారణంగా కీళ్ల నొప్పులు, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, దీర్ఘకాలంలో స్పర్శ కోల్పోయే పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు.
పాలిష్ చేసిన బియ్యం శరీర బలాన్ని కూడా తగ్గిస్తుంది. కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరుకు కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు లేకపోవడంతో నడవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. సరైన పోషకాలు అందకపోవడం మానసిక ఆరోగ్యానికీ దెబ్బతీస్తుంది. ఒత్తిడి, ఆందోళన, అలసట వంటి సమస్యలు పెరగవచ్చు. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల పాలిష్ బియ్యంపై ఎక్కువగా ఆధారపడకుండా సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ALSO READ: MLA’s Offer: కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షలు





