తెలంగాణ

కాంగ్రెస్‌ కార్యాలయాల్లా పోలీస్‌స్టేషన్లు!… ఆర్మూర్‌ పీఎస్‌లో హస్తం పార్టీ నేతల ప్రెస్‌మీట్‌

  • ఆర్మూర్‌ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

  • ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లు చేసిన పోలీసులు!

  • టేబుల్‌పై పోలీసు టోపీల దర్శనం!

  • బాల్కొండ యూత్‌ కాంగ్రెస్‌ నేతలకు రాచమర్యాదలు

క్రైమ్‌మిర్రర్‌, నిజామాబాద్: కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పడ్డాక తెలంగాణలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో యూత్‌ కాంగ్రెస్‌ నేతలకు పోలీసులు రాచమర్యాదలు చూపడం ఈ విమర్శలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. పోలీస్‌స్టేషన్లు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లా మారుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనన్నట్లు వ్యవహారాలున్నాయి.

ఆర్మూర్‌ పీఎస్‌లో హస్తం నేతల ప్రెస్‌మీట్‌

బాల్కొండ నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య వైరం ముదిరింది. దీంతో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడే పోలీసులు తమ పార్శాలిటీ చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు ఒకలా… విపక్ష బీఆర్‌ఎస్‌ నేతలను మరోలా ట్రీట్‌ చేస్తున్నట్లు వినికిడి. తాజాగా జరిగిన ఓ సంఘటనలో యూత్‌ కాంగ్రెస్‌ నేతలను ముందస్తు అరెస్ట్‌ చేసి ఆర్మూర్‌ ఓల్డ్‌ పీఎస్‌కు తరలించారు. అయితే అక్కడ యూత్‌ కాంగ్రెస్‌ లీడర్లకు పోలీసులు ఎక్కడాలేని రాచమర్యాదలు చేశారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ ఫర్నిచర్‌ను వాడుకునేలా అవకాశం కల్పించారు. పోలీసులే దగ్గరుండి అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటుకు అన్నీ సిద్ధం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు ఏర్పాట్లు చేసే క్రమంలో టేబుల్‌పై టోపీలు వదిలేశారు.

పోలీసులపై చర్యలకు విపక్షాల డిమాండ్‌

రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల పట్ల ఒకలా, విపక్ష నేతల పట్ల మరోలా ప్రవర్తించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలు ఏకంగా పీఎస్‌లోనే ప్రెస్‌మీట్‌ పెట్టే స్థాయికి వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది పోలీసుల విపరీత పోకడలకు నిదర్శనమని మండిపడుతున్నారు. ఆర్మూర్‌ పోలీసులపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also:

  1. తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌
  2. ఏపీ మహిళలకు శుభవార్త… ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
Back to top button