జాతీయం

PM Modi: పిల్లాడి ప్రేమకు ప్రధాని మోడీ ఫిదా, కేరళ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం!

ప్రధాని మోడీ కేరళ పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ పిల్లాడి ప్రేమకు ఆయన అయ్యారు. అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, కేరళలో ప్రధాని మోడీ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పాలక పార్టీలు,కూటములపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తిరువనంతపురం ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ స్పీచ్ సందర్భంగా మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ పిల్లాడి ప్రేమకు మోదీ ఫిదా అయ్యారు. అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే?

ప్రధాని మోడీ మాట్లాడుతుండగా ఓ పిల్లాడు ఆయన స్కెచ్‌‌ను పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ పిల్లాడు చాలా సేపటినుంచి అలానే నిలబడి ఉండటంతో మోడీ చలించిపోయారు. తన ప్రసంగాన్ని ఆపేశారు. “ఆ పిల్లాడు చాలా సేపటి నుంచి స్కెచ్ గాల్లోకి ఎత్తి పట్టుకుని నిలబడి ఉండటం చూస్తూ ఉన్నాను. అంతసేపు నిల్చుంటే అలసిపోతావు. ఆ స్కెచ్‌ను నాకు ఇవ్వు. స్కెచ్ వెనకాలి వైపు నీ అడ్రస్ రాసి ఇవ్వు. నేను నీకు లేఖ రాస్తాను. ఎస్పీజీ సిబ్బంది ఆ పిల్లాడి ప్రేమను అతి జాగ్రత్తగా తీసుకొచ్చి నాకు ఇవ్వాలని కోరుతున్నాను”అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తమిళనాడులో డీఎంకే టైమ్ అయిపోయిందన్న మోడీ!

అటు తమిళనాడులో డీఎంకే టైమైపోయిందన్నారు ప్రధాని మోడీ. అవినీతి డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించేశారని తెలిపారు. ఇక తమిళనాడు ఎన్‌డీఏతోనే ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. చెన్నై మదురాంతకంలో జరిగిన భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. “డీఎంకే ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇది అవినీతి, మాఫియా, నేరాల సర్కారు. అది ఒక కుటుంబాన్ని మాత్రమే సేవిస్తోంది. ఈ పార్టీలో ఎదగాలంటే.. వారసత్వం, అవినీతి, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, భారత సంస్కృతిని తూలనాడం కావాలి” అన్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని ప్రధాని అన్నారు. 2014కి ముందు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్‌, డీఎంకే భాగస్వాములుగా ఉన్నప్పుడు విడుదలైన నిధుల కంటే 3 రెట్ల నిధులను తన ప్రభుత్వం తమిళనాడుకు ఇచ్చిందని తెలిపారు.  రాష్ట్ర ప్రజలు డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button