జాతీయం

33 దేశాలు.. 362 కోట్లు, ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చు!

PM Modi Foreign Visits Cost:  ప్రధాని మోడీ 2021-25 మధ్య 33 దేశాల్లో పర్యటించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రూ.362 కోట్లు ఖర్చయిందని ప్రకటించింది. తాజాగా రాజ్యసభలో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ ఈ పర్యటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ లిస్టులో ప్రస్తుత బ్రిటన్‌, మాల్దీవుల పర్యటనకు సంబంధించిన ఖర్చులను చేర్చలేదని తెలిపారు. ఈ నెల మొదట్లో వెళ్లిన ఐదు దేశాల పర్యటన సహా మొత్తం ఐదేళ్లలో ప్రధాని 33 దేశాల్లో పర్యటించారని తెలిపారు. అటు కెనడా, బ్రెజిల్‌, మారిషస్‌ దేశాల పర్యటన బిల్లులను పూర్తిగా చెల్లించనందున వాటిని లెక్కల్లో చేర్చలేదని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌, అమెరికా, ఏప్రిల్‌లో థాయ్‌లాండ్‌, శ్రీలంక, సౌదీ అరేబియాలలో పర్యటించారని.. వీటి ఖర్చు రూ.67కోట్లు అయిందన్నారు. వీటిలో ఫ్రాన్స్‌, అమెరికాలలో పర్యటించినప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు.  ఫిబ్రవరి 13న ప్రధాని అమెరికాలో పర్యటించారని.. ఆ ఒక్క రోజే రూ.16.54 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు.

మాల్దీవులకు రూ. 4,850 కోట్ల సాయం

ప్రధాని మోడీ మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనకు మాల్దీవుల రాజధాని మాలెలో ఘన స్వాగతం లభించింది.  సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మహమద్‌ ముయిజ్జు, పలువురు ఆ దేశ మంత్రులు స్వయంగా మాలెలోని వెలెనా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్‌ స్క్వేర్‌లో సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి సైనిక వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్వయంగా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, మౌలిక వసతులు వంటి అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు ఒక ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. మాల్దీవులకు రూ. 4,850 కోట్ల రుణ సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also: భారత్‌-యూకే మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌, చారిత్రాత్మక రోజుగా అభివర్ణించిన మోడీ!

Back to top button