అంతర్జాతీయం

ఆగస్టు 29 నుంచి.. జపాన్, చైనా పర్యటనకు ప్రధాని మోడీ!

PM Modi Japan-China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, ప్రధాని మోడీ ఆగస్టు 29, 30 తేదీల్లో 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని హోదాలో మోడీ 8వ సారి జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఇషిబాతో ప్రధానికి ఇది తొలి శిఖరాగ్ర సమావేశం అని విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో ఇద్దరు నాయకులు భారత్ – జపాన్ మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, ప్రజల మధ్య మార్పిడిఅంశాలపై చర్చినున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత పెంచుతుందని విదేశాంగశాఖ వెల్లడించింది.

చైనాలో రెండు రోజుల పర్యటన

జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోడీ చైనాకు వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు, ప్రధాని  ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. భారత్ 2017 నుండి SCOలో సభ్యదేశంగా మారింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తాజాగా ప్రధాని మోడీని కలిసి, SCO శిఖరాగ్ర సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button