అంతర్జాతీయం

పుతిన్ తో మీటింగ్.. ప్రధాని మోడీకి జెలన్ స్కీ ఫోన్!

Ukraine President: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌ స్కీ తమ దేశంలో యుద్ధాన్ని ఆపి శాంతి స్థాపన కోసం భారత్ కీలకంగా వ్యవహరించాలని కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని, షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు వేదికగా రష్యాను ఒప్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. చైనా పర్యటనలో ఉన్న ప్రధానికి జెలన్ స్కీ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ లోని తాజా పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు యూరప్ నేతలతో చర్చల వివరాలు ప్రధానితో పంచుకున్నారు.

శాంతియుత పరిష్కారమే సరైన మార్గమన్న మోడీ

ఇక జెలన్ స్కీ కాల్ కు ప్రతిస్పందనగా మోడీ, ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే సరైన మార్గమని భారత్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుందని చెప్పుకొచ్చారు.  శాంతి సాధన కోసం చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని  భరోసా ఇచ్చారు. ఇరువురూ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఫోన్ సంభాషణ తర్వాత జెలెన్‌ స్కీ సోషల్ మీడియా వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. మా పట్టణాలపై వరుస దాడులు జరుగుతున్న సమయంలో శాంతి చర్చలు ఫలప్రదం కావని భావిస్తున్నట్లు చెప్పారు. తక్షణ కాల్పుల విరమణ జరగాలన్నారు. ఈ యుద్ధానికి ముగింపు కాల్పుల విరమణ నుంచే మొదలవ్వాలన్నారు. ఎస్‌సీవో సదస్సులో భారత్ రష్యా సహా ఇతర దేశాలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. అటు త్వరలోనే ప్రధాని మోడీని ప్రత్యక్షంగా కలువబోతున్నట్లు వెల్లడించారు.

పుతిన్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశం

ప్రస్తుతం ప్రధాని మోడీ చైనాలోని టియాంజిన్‌ లో షాంఘై సహకార సంస్థ హాజరవుతున్నారు. ఈ వేదికపైనే ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కీలక భేటీకి ముందు జెలెన్‌ స్కీ ప్రధాని మోడీకి ఫోన్‌ చేయడం ఆసక్తి కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button