జాతీయం

PM Modi: మీ కంటే అసదుద్దీన్ బెస్ట్, తెలంగాణ బీజేపీ నేతలపై మోడీ ఆగ్రహం

తెలంగాణ బీజేపీ నేతలపై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లో పార్టీ అత్యంత బలహీనంగా ఉందని ఆగ్రహం. పార్టీ నేతలు ఏమాత్రం పని చేయడం లేదన్నారు.

సౌత్ ఇండియాలో బీజేపీ బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో పార్టీ నాయకుల పనితీరు అస్సలు బాగాలేదన్నారు. రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ.. పార్టీ నేతలు సరిగా పనిచేయట్లేదని, ముఠా తగాదాలు పెరిగాయన్నారు. 8 మంది ఎంపీలున్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నా.. నాయకులు పనిచేయకపోవడం వల్లనే పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

తెలంగాణలో పార్టీ ఎందుకు బలోపేతం కావడం లేదు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అండమాన్‌ ఎంపీలకు పార్లమెంట్‌ అనెక్సీలో అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని మోడీ.. ఆ మూడు చోట్లా పార్టీ పనితీరుపై సమీక్ష జరిపారు. తెలంగాణలో ఎంపీల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆయన.. తెలంగాణాలో ఎందుకు వెనుకబడిపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్‌ పెరిగేందుకు మంచి అవకాశం ఉన్నా ఉపయోగించుకోవడంలో విఫలమవుతోందని, ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఎనిమిది మంది ఎంపీలున్నా పార్టీ బలహీనంగా ఉన్నదని ధ్వజమెత్తారు. దీనిపై ఒక ఎంపీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఇద్దరు కేంద్రమంత్రులను ఉద్దేశించి..  మీరు ఢిల్లీలో తక్కువ, హైదరాబాద్‌లో ఎక్కువ గడుపుతున్నారు. అయినా పార్టీ ఎందుకు బలంగా లేదని ప్రశ్నించారు. బలమైన టీమ్‌ను ఏర్పరచుకుని పనిచేయడానికి ఏమి అడ్డొచ్చిందని మోడీ.. అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

మీ కంటే అసదుద్దీన్ బెస్ట్!

గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పనిచేయాలని, పార్టీ బలపడేలా దూకుడుగా పనిచేయాలని, కార్యకర్తలతో టిఫిన్‌ బైఠక్‌లు నిర్వహించాలని, యువతకు చేరువ కావాలని ప్రధాని మోడీ సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఒకప్పుడు ఒడిశాలో ఉనికిలో లేకపోయినా అక్కడ బీజేపీ నేతలు సంఘటితంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని ఆయన ప్రస్తావించారు. అటు సోషల్‌ మీడియాలో కూడా  చురుగ్గా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.. బీజేపీ నేతలతో పోల్చితే ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ తన సోషల్‌ మీడియాను ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.  కనీసం ఆయనను చూసైనా నేర్చుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button