
PM Modi On Pahalgam Attack At BRICS Summit: జమ్మూకాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించిన ప్రధాని.. దాయాది దేశం పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారు దేశం అయితే, భారత్ ఉగ్రవాద బాధిత దేశమన్నారు. ఈ రెండు దేశాలను ఒకే కాంటాలో తూకం వేయలేమన్నారు. “పాకిస్థాన్ ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి మద్దతుగా ఉంటుంది. భారత్ ఉగ్రవాద బాధితురాలిగా ఉంది. ఈ రెండు దేశాలను ఒకే కాంటాలో వేసి తూకం వేయలేం” అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు ఎలా మద్దతు ఇచ్చినా తప్పేనని ఆయన తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించి, భారత్ కు మద్దతుగా నిలిచిన బ్రిక్స్ దేశాలకు, ఇతర ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
పహల్గామ్ దాడిని ఖండించిన బ్రిక్స్ దేశాలు
అటు ఈ సమావేశం పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ తీర్మానం చేశాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందేనని బ్రిక్స్ నాయకులు తేల్చి చెప్పారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతో పాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: పహల్గాం ఉగ్ర దాడి.. ముక్తకంఠంతో ఖండించిన బ్రిక్స్ దేశాలు!