
PM Modi Manipur Visit: ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈనెల 13న ఆయన ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. తొలుత ఆయన మిజోరంలో పర్యటిస్తారని ఐజ్వాల్ అధికారులు వెల్లడించారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్ ను ప్రారంభించేందుకు ఆయన మిజోరం వస్తారని తెలిపారు. 2023 మే నెలలో రెండు వర్గాల మధ్య మణిపూర్ లో ఘర్షణ తలెత్తింది. విధ్వంసకరంగా మారిన ఆ ఘర్షణ నేపథ్యంలో ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మణిపూర్ కు ఎందుకు వెళ్లడం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. తాజా సమాచారం ప్రకారం .. మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి త్వరలో తుది షెడ్యూల్ రెడీ కానుంది. ఇంపాల్ లో ఉన్న అధికారులకు ఈ పర్యటనకు సంబంధించి ఎలా సమాచారం లేదు.
మిజోరంలో ప్రధాని పర్యటనపై అధికారుల సమీక్ష
అటు మిజోరం చీఫ్ సెక్రటరీ ఖిల్లి రామ్ మీనా వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని మోడీ రాక కోసం భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సెక్యూర్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రిసెప్షన్, స్ట్రీట్ డెకరేషన్ లాంటి అంశాలపై చర్చించారు. ఐజ్వాల్ సమీపంలోని లామౌల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్నది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 51.38 కిలోమీటర్ల పొడువైన రైల్వే లైన్ ను నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ పెంచేందుకు ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అస్సాంలోని సిల్చార్ పట్టణం నుంచి కొత్త రైల్వే లైన్‌కు ఐజ్వాల్ తో లింక్ అవుతుంది.